21.7 C
Hyderabad
Thursday, March 20, 2025
spot_img

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే సినీ కవి గేయ వాక్కులు దశాబ్దాల క్రితం ఎప్పుడో.. ఆయన కలం నుంచి జాలువారినా.. అవి అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి అపర సత్యలే.

రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు, జల ప్రమాదాలు, విమాన ప్రమాదాలు… ఇలా ఎన్నో ప్రమాదాలు మనకు తెలుసు అయితే, లిఫ్ట్ లు, ఎస్కలేటర్ ప్రమాదాలు అనే మాటలు ఇటీవల తరచు వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం భాగ్యనగరంలో చోటు చేసుకున్న లిఫ్ట్ నిర్వాకం ఈ రీతిన ఉంది. ఓ చోట కొంతమందితో కలిసి.. ఓ భారీకాయ మహిళ లిఫ్ట్ లో ఎక్కగా… బరువుకు, మరెందుకో కాని.. ఆ లిఫ్ట్ పైకి, కిందకి ఆగకుండా స్పీడ్ గా వెళ్లింది. దీంతో, ఆ భారీ శరీర మహిళతో పాటు అందులో ఉన్నవారు ఠారెత్తిపోయారు. కొంత సేపు పైకి, కిందకి సాగిన లిఫ్ట్ ఎగురులాట అయ్యాక..ఎట్టకేలకు అపార్ట్ మెంట్ వాసులు, వాచ్ మెన్, లిఫ్ట్ టెక్నీషియన్లు కలిసి దాన్ని ఆపుచేశారు. బతుకు జీవుడా.. అంటూ లిఫ్ట్ లోని వారు బయటపడ్డారు. సమయానికి ప్రమాద నివారణ చర్యలు చేపట్టకపోయినా, ప్రమాద విషయం ఎవరికీ చేరకపోయినా నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అదృష్టవశాత్తు.. అందులో హార్ట్ పేషెంట్లు, భయస్తులు, బలహీన గుండె కలవారు లేకపోవడంతో.. ఆ ప్రమాదం తప్పింది. ఇంత భయంకర ఆకస్మిక ప్రమాదం సంభవిస్తే.. ఏ స్ట్రోక్ లు లేకపోయినా హార్ట్ స్ట్రోక్ లకు గురి అయ్యే అవకాశం ఉంది. హార్ట్ స్ట్రోక్ లు ఉన్నవారు ప్రాణాలు కొల్పోయే అవకాశం ఉంది. ఇక్కడ ప్రమాదం నుంచి బాధితులు బయట పడ్డారు.

అయితే, ఇటీవల రెండు లిఫ్ట్ ప్రమాదాలు ఇద్దరిని పొట్టన పెట్టేసుకున్నాయి. మెహిదీ పట్నం ముస్తఫా అపార్ట్ మెంట్ లో మెన్స్ హాస్టల్ ఉంది. ఇందులో నేపాల్ కు చెందిన ఓ పేద కుటుంబం పనిచేస్తోంది. కుటుంబ పెద్ద వాచ్ మెన్ గా, కుటుంబ సభ్యులు అపార్ట్ మెంట్ వాసుల ఇళ్లల్లో, హాస్టల్ లో పనులు చేస్తున్నారు. దీంతో, తరచు లిఫ్ట్ మీద పైకి కిందకు వెళ్లడం అనివార్యం అయ్యింది. ఎనిమిదేళ్లుగా వాచ్ మెన్ దంపతులు ఇక్కడ పనిచేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఈ దంపతుల నాలుగేళ్ల కుమారుడు సురేందర్ లిఫ్ట్ లోకి వెళుతుండగా మధ్యలో ఇరుక్కుపోయాడు. క్షణాల్లో ఆ బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కళ్ల ఎదుటే కన్నబిడ్డ విగతజీవిగా మారడం చూసి ఆ దంపతులు గుండెలవిసేలా రోదించారు.

ఈ దుర్ఘటన దుర్వార్త సమయంలోనే మరో లిఫ్ట్ ప్రమాదం బెటాలియన్ కమాండెంట్ ను పొట్టన పెట్టేసుకుంది. సిరిసిల్ల పదిహేడవ బెటాలియన్న కమాండెంట్ తోట గంగారాం అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలోని వెంకట్రావ్ నగర్ అపార్ట్ మెంట్ లో ఉండే తన స్నేహితుడు, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి గంగారాం వెళ్లారు. కొంతసేపు స్నేహితుడితో ముచ్చటించి అపార్ట్ మెంట్ మూడో అంతస్థులోని లిఫ్ట్ వద్దకు వచ్చారు. లిఫ్ట్ స్విచ్ నొక్కగా సేఫ్టీ డోర్ తెరుచుకుంది. లిఫ్ట్ లోకి వెళ్లేందుకు ఆయన ముందుకు అడుగు వేశారు. అయితే, లిఫ్ట్ ఫంక్షనింగ్ సరిగా లేక గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ హౌస్ కంపార్ట్ మెంట్ పై పడి తీవ్రంగా గాయపడ్డారు. అపార్ట్ మెంట్ వాసులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఆయనను బయటకు తీసి ఆసుపత్రికి తరలించడానికి సిద్దమయ్యారు. అయితే, అప్పటికే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అంతవరకు తనతో ఉత్సాహంగా మాట్లాడిన ప్రాణ స్నేహితుడి ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోవడంతో… డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా దుఃఖించారు.

కొన్ని ఏళ్ల క్రితం సికింద్రాబాద్ ఎస్క్ లేటర్ మధ్య చిక్కుకుని వెస్ట్ మల్కాజ్ గిరికి చెందిన గృహిణి ప్రాణాలు కోల్పోయారు. ఏదో శుభకార్యానికి ఊరు వెళ్లి కుటుంబ సభ్యులు అందరు తిరిగి హైదరాబాద్ కు వచ్చారు. వేకువ జాము సమయం కావడంతో అక్కడ ఎస్క్ లేటర్ సిబ్బంది లేరు. ఆమె తల్లి ఎస్క్ లేటర్ లో ఎక్కి తడబడుతుండగా.. ఈమె, ఆమెను కాపాడడానికి ప్రయత్నించింది. అయితే, ఆ తల్లి కాపాడబడింది కాని….ఈ బిడ్డ ప్రాణాలు కోల్పోయింది.

ఇలా ఎన్నో..ఎన్నో.. ఆకస్మికంగా దురదృష్ట ఘటనలు చోటుచేసుకోవడం నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోవడం తరచు ఎక్కడో ఒక చోట జరుగుతోంది. ఇక జల ప్రమాదాలు మాట వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. సముద్రాలు, నదులు, చెరువులు, కాలవలు, వాగులు, వరదల్లో జనాలు కొట్టుకుపోయే ప్రమాదాలు, తుఫానుల్లో విద్యుదాఘాతాలు.. ఇలా ఎన్నో అవాంఛనీయ ఘటనలు తరుచు జరుగుతున్నాయి. సాధారణంగా కార్తీక మాసం, పవిత్ర పర్వదినాల్లో నదీస్నానాలు, తటాక స్నానాలు, సముద్ర స్నానాలు చేస్తారు. ఈ స్నాన ప్రాంతాల్లో కొన్ని డేంజర్ ప్లేస్ లుగా పేరొందాయి. ఏపీలోని భీమ్లీ బీచ్, తుని పరిసరాల్లోని కట్రాళ్ల ప్రాంతాల్లో స్నానాలు, ఈతలు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. చాలాకాలం క్రితం తుని, పాయకరావుపేట కట్రాళ్ల ప్రాంతంలో ఓ దురుదృష్ట ఘటన జరిగింది. స్థానికంగా హిందీ టీచర్ గా చేసే ఓ విప్రకుటుంబానికి చెందిన వ్యక్తి.. రోజూ మాదిరి తన విధులు నిర్వహించుకుని అర్థరాత్రి వరకు మేల్కొని టీచింగ్ కు సంబంధించిన తన వర్క్ పూర్తిచేసుకుని.. అనంతరం నిద్రకు ఉపక్రమించాడు. హైదరాబాద్ లో ఉన్న అతని స్నేహితులు..తునికి వచ్చారు.

తెల్లవారు జామును ట్రయిన్ దిగి.. కార్తీక మాసం కదా.. కట్రాళ్లలో స్నానానికి వెళదామని.. తన హిందీ టీచర్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు. అతనిని నిద్రలేపి.. ముగ్గురూ కలిసి కట్రాళ్లలోని స్నాన ప్రదేశానికి వెళ్లారు. అప్పటికే అక్కడ ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అక్కడ స్నానం అంటే అతి జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఈ ముగ్గురు హుషారుగా స్నానం చేస్తుండగా.. హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతుండగా.. ఈ ఇద్దరు అతనిని కాపాడడానికి ప్రయత్నించారు. అయితే, విధి విలాసం ఎలా ఉందంటే.. నీట మునిగిన వ్యక్తిని ఈ ఇద్దరు బయటకు లాగే సమయంలో స్థానికంగా ఉన్న వ్యక్తి… హిందీ టీచర్ కట్రాళ్లలో నీళ్లలో మునిగిపోయాడు. ఎక్కడి నుంచో వచ్చి..నిద్రలో ఉన్న వ్యక్తిని లేపి… దీర్ఘ నిద్రలోకి పంపించేశామే అని.. ఆ ఇద్దరి స్నేహితులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని, క్షణ క్షణం భద్రత, జాగ్రత్త, రక్షణ చర్యలు చేపట్టాలని ఈ ఘటన రుజువు చేస్తోంది.

విధిని ఎదిరించడం ఎవరితరం కాదు. ఈ విషయం ముమ్మాటికీ నిజమే. నిర్లక్ష్యం, అలక్ష్యం, అజాగ్రత్తలు అధికశాతం ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉండగా, జాగ్రత్త, భద్రత, ముందు వెనుకలు ఆలోచించి పనులు చేపట్టడం వల్ల డేంజర్ల నుంచి కాపాడబడే అవకాశం ఉంటుంది. ఎలా జరిగేది అలాగే జరుగుతుందనే దానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నా.. గాలిలో దీపం.. దేవుడా భారం అనే రీతిలో ఉండకూడదు. మన పెద్దలు నిదానమే ప్రదానం అని, ముందు వెనుకలు ఆలోచించకుండా ఏ పని చేయరాదని చెప్పారు. అదే పెద్దలు ఆలస్యం అమృతం విషం అన్నారు. సమయాసమయాలు, సందర్భానుసారం ఆయా సామెతలు పాటించాల్సి ఉంటుంది కాని, పిడుక్కు, బియ్యానికి ఒకే మంత్రంలా వ్యవహరించకూడదని ఆ పెద్దలే చెబుతున్నారు.

విధిని ఎవరూ తప్పించలేరు అనే దానికి బహుచక్కని ఓ చందమామ కథ ఉంది. అయితే, తప్పించలేని విధిని ఉన్నంతలో చక్కగా తీర్చిదిద్దుకునే చాన్స్ ఉన్నా..దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుని కష్టాలపాలు కాకూడదు కదా..! ఆ కథలో ఓ విప్రుడు.. ఓ జ్యోతిష్య స్నేహితుడితో ముచ్చటిస్తుండగా, విధివిలాసం, అదృష్టం, దురదృష్టం మీద సంభాషణ కొనసాగుతుంది. స్నేహితుడి జ్యోతిష్యం మీద విప్రుడికి నమ్మకం ఉంది కాని, విధిని ఎదిరించి నిలబడవచ్చనే వాదనను సమర్థించేవాడు. అయితే, ఈ సంభాషణలో.. సడన్ గా తానెక్కడ, ఎప్పుడు మరణిస్తానని జ్యోతిష్య స్నేహితుని అడుగుతాడు. దీనికి, సమాధానం ఇవ్వడానికి జ్యోతిష్కుడు తిరస్కరిస్తాడు. ఈ తరహా ప్రశ్నలు సమంజసం కాదని టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే, సమాధానం చెప్పితీరాలని పట్టుబట్టడంతో.. జ్యోతిష్య శాస్త్రం ఆమూలాగ్రం పరిశీలించి.. ఫలానా పవిత్ర క్షేత్రంలో… ఫలానా చోట.. చెట్టు కింద ఉరితీయబడి ప్రాణాలు కోల్పోతావని జ్యోతిష్య ఫ్రెండ్ చెబుతాడు.

పక్క ఊరికి వెళ్లడానికే రవాణా సౌకర్యాలు లేని ఆ కాలంలో ఎక్కడో యోజనాల దూరంలోని క్షేత్రంలో చెట్టు కింద ఉరికి గురవ్వడం ఏమిటి, ఇది అసాధ్యం అని మనకు అనిపిస్తుంది కదా..! ఈ రూట్ లోనే ఆ విప్రుడు ఆలోచనలు సాగించాడు. అయితే, స్నేహితుడి జ్యోతిష్య విద్యమీద నమ్మకం ఉన్న ఆ వ్యక్తి ఏమో.. ఏదైనా జరగవచ్చు.. తనకు హస్తాలు, పాదాలు ఉంటే కదా.. అంత దూరానికి వెళ్లడం…వాటిని దూరం చేసేసుకుంటే.. ఎక్కడికి కదలను కదా.. అనుకుని కాళ్లు, చేతులు నరికేసుకుంటాడు. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట కదా..ఏ విపత్కర పరిస్థితి వచ్చినా, ప్రాణాలు పోతాయన్నా, ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నా.. వివేకాన్ని కొల్పోకోడదు. స్వీయ ఆలోచనలు విస్మరించకూడదు. అయితే, ఆ కథలో రచయిత జ్యోతిష్యంలో తేడా లేదనే నిరూపించాడు.

ఇలా కాళ్లు, చేతులు నరుక్కుని గ్రామంలో వాళ్లమీద, వీళ్ల మీద ఆధారపడి రోజులు గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ పడతి ఆ విప్రునిపై జాలిపడి సదుద్దేశంతో.. ఆ వ్యక్తికి సపరిచర్యలు చేయడం మొదలెట్టింది. కొన్నేళ్లు గడిచాకా.. ఆమె…తాను పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోవాలనుకుంటున్నాని.. ఈ స్థితిలో మిమ్ములను వదిలి వెళ్లలేనని.. తాను దగ్గరుండి, జాగ్రత్తగా యాత్రలు చేయిస్తానని అతనికి చెబుతుంది. పూర్వం తనకు, తన స్నేహితునికి మధ్య జరిగిన సంభాషణ, ఫలానా చోట ఉరి అనే విషయాలన్ని విప్రుడు మర్చిపోయాడు. ఆమెతో యాత్రలకు బయలుదేరతాడు.

తనకు ఇంతలా సపరిచర్యలు చేస్తున్న ఆమె మాట కాదనకూడదని…ఆమె తో యాత్రలకు వెళ్లాడు. అయితే, ఆ జ్యోతిష్యుడు చెప్పిన ప్రదేశానికే ఈ యాత్ర సాగడం, అక్కడ వెత్సాల కోసం ఆమె బయటకు వెళ్లడం, అదే సమయంలో చోరులను రాజభటులు తరుముకుంటూ రావడం, చోరులు తాము తస్కరించిన సొమ్ము మూటలు కాళ్లు చేతులు నరుక్కున్న వ్యక్తి ముందు పారవేసి పారిపోవడం, రాజభటులు ఈ వ్యక్తిని పట్టుకోవడం, దొంగల భాగస్వామి అని నిర్ణయించి, అక్కడే చెట్టుకు ఉరితీయడం చకచకా జరిగిపోతాయని ఆ కథ వివరించింది. అయితే, కాళ్లు, చేతులు లేనివాడు చోరుడు ఎలా అవుతాడని, చోర భాగస్వామ్యం ఉన్నా, కనికరంతో కారాగార శిక్ష విధించవచ్చేమో కాని, ఉరి శిక్ష వేసేయడం ఏమిటని…. ఆ కథ చదివిన పాఠకులు ప్రశ్నించారేమో. అయితే, అది వేరే విషయం. ముందు వెనుకలు ఆలోచించకుండా ఏ పని చేయరాదని పెద్దల సామెతను.. ఈ అమాయక విప్రుడు ఆలోచించి ఉంటే కథ వేరేలా ఉండేది కదా..! అక్కరలేని, పనికిరాని సంభాషణలు, పట్టుదలల నిర్ణయాలు..ఎన్ని అనర్థాలు తెస్తాయనేది ఈ కధ తెలియజేస్తోంది. ప్రతి చోట అప్రమత్తత, జాగ్రత్త ఉంటే.. కొంతవరకునో, చాలావరకునో ప్రమాదాలు అరికట్ట వచ్చనేది కాదన లేదని సత్యం.

Latest Articles

గోల్ఫింగ్ ప్రతిభ ప్రదర్శనకు గోల్డెన్ ఆపర్ట్యూనిటీ గోల్ఫ్ టోర్నీ – టీ9 ఛాలెంజ్ గోల్ఫ్ టోర్నీ ఘనంగా ప్రారంభం

దేహదారుడ్యానికి, మానసిక వికాసానికి దోహదమయ్యేవి క్రీడలు. శారీరక ఆరోగ్యానికి చక్కని సాధనమైన క్రీడలు, మనిషికి నూతన శక్తి కల్గించి, కొత్త పుంతలు తొక్కిస్తాయి. మనోరంజక సాధకంగా నిలిచి వీక్షకులను ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తాయి....
- Advertisement -

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్