తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసం ప్రజాభవన్‌లో శనివారం ఎంపీలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలతో ఈ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్‌పై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ మీటింగ్‌కి కాంగ్రెస్ ఎంపీలు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రమే హాజరుకాగా.. బీజేపీ, బీఆర్‌ఎస్ ఎంపీలు డుమ్మా కొట్టారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కీలక చర్చలు జరుపుదామంటూ శుక్రవారం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలకు భట్టి విక్రమార్క లేఖలు పంపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మలి విడత సమావేశాలకు సమయం ఆసన్నమైన వేళ ఈ మీటింగ్ కీలకమైనదిగా భావించారు. అన్ని పార్టీల ఎంపీలు ఈ సమావేశానికి హాజరై రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని లేఖలో భట్టి విక్రమార్క కోరారు.
అయితే భట్టి వినతిని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సున్నితంగా తిరస్కరించాయి. ఈ మేరకు భట్టికి బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి జవాబు లేఖలు పంపించారు. ఆయా లేఖల్లో రెండు పార్టీలు దాదాపు ఒకే కారణాన్ని ప్రస్తావించాయి. భట్టి పంపించిన లేఖ ఆలస్యంగా అందడం కారణంగా పార్టీలో చర్చించుకునేందుకు సమయం లేకుండా పోయిందని తెలిపాయి. ఇప్పటికిప్పుడు అంటే మీటింగ్‌కు రావడానికి ఎలా కుదురుతుందని ప్రశ్నించాయి. ఇలాంటి కీలక భేటీల గురించి ముందుగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేదని స్పష్టం చేశాయి. మరోవైపు ఇప్పటికే పలు కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు చేసుకుని ఉన్నందున ఈ భేటీకి రాలేకపోతున్నామని తెలిపాయి. ఆల్ పార్టీ మీటింగ్‌కు పిలిచినందుకు ఇరు పార్టీలు భట్టికి ధన్యవాదాలు తెలిపాయి.