స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీలో టీడీపీ పరిస్థితి సంచలనంగా మారింది. ఓవైపు చంద్రబాబును అరెస్టు చేయగా.. మరోవైపు లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగు తమ్ముళ్లంతా రోడ్డెక్కుతున్నారు. వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతూ.. బాబుకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో.. తెలంగాణ నేతలు కూడా చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. అయితే.. అరెస్టయిన చాలా రోజుల తర్వాతే బీఆర్ఎస్ నేతలు స్పందించటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఇదే అంశంపై హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఓట్ల కోసమే ఎన్టీఆర్ జపం చేస్తున్నారని.. బాలకృష్ణ విమర్శించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ నేతలతో బాలయ్య భేటీ అయ్యారు.
త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరుగనున్న సమయంలో.. బీఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్ జపం చేస్తున్నారని బాలయ్య తెలిపారు. చంద్రబాబు అరెస్టయినప్పుడు ఒక్కరు కూడా మాట్లాడలేదు కానీ.. ఇన్ని రోజుల తర్వాత ఖండిస్తున్నారని చెప్పుకొచ్చారు. కేవలం ఓట్ల కోసమే ఇక్కడ ఎన్టీఆర్ జపం చేస్తున్నారని ఆరోపించారు. ఇంతకాలం తెలంగాణలో టీడీపీ అజ్ఞాతంలో ఉందని.. ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తోందన్నారు. తెలంగాణ టీడీపీ కోసం తానున్నానని చెప్పుకొచ్చారు. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లని తెలిపారు.
అయితే.. చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదని… అనవసరంగా ఎవరిపైనా నిందలు వేయమన్నారు బాలయ్య. కేంద్రం కల్పించుకోవాల్సిన అవసరం ఉన్న సమయంలో వారు మాట్లాడకపోవడం వారి విజ్ఞతకే వదిలేయాలన్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని తెలిపారు. అయితే.. చంద్రాబాబు అరెస్టుపై సినిమా వాళ్లు స్పందించక పోవడాన్ని తాను పట్టించుకోనన్నారు. ఈ క్రమంలోనే.. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అంటూ కొట్టిపారేశారు. ఇక రోజా లాంటి వారి స్పందనపై మౌనంగా ఉండటమే మేలని.. వాళ్ల విషయంలో కలుగజేసుకుంటే.. బురద మీద రాయి వేస్తేనట్టేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ.