ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ పోతినేని(RAPO) నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్(BOYAPATI)తో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ కాంబినేషన్ పై ఇండస్ట్రీలో మాంఛి హైప్ నెలకొంది. బోయపాటి సినిమాల్లో హీరోలంటే ఊరమాస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు. క్లాస్ లుక్స్ తో చాక్లెట్ బాయ్ లాగా ఉండే రామ్ ను కూడా ఊరమాస్ లుక్ లోకి తీసుకొచ్చాడు బోయపాటి. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి ఒక్క అప్టేడ్ కూడా ఇవ్వని చిత్ర యూనిట్.. తాజాగా రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్ 20న సినిమా విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో రామ్ క్యారెక్టర్ ఎంత రచ్చగా ఉండబోతుందో అర్థమవుతోంది. గుబురు గడ్డం.. గాగుల్స్.. సీరియస్ లుక్ తో ఒక ఎద్దును లాక్కెళుతూ కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు చూసినా రామ్ వేరు.. బోయపాటి సినిమా హీరో వేరు అన్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.