తిరుపతిలో పెను విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని కనులారా దర్శించి తరించాలనుకున్న శ్రీవారి భక్తులు.. టోకెన్లు తీసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఊహించని రీతిన చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ హృదయ విదారక ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసింది.
అసలేం జరిగింది?
బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల వద్ద తాకిడి తక్కువగా ఉంటుందని భావించిన యాత్రికులు బుధవారం ఉదయం 10 గంటలకే అక్కడకు చేరుకున్నారు. రాత్రికి పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. పోలీసులు పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి భక్తులను వదిలారు. రాత్రి 8.20 గంటలకు అక్కడి నుంచి క్యూలైన్లలోకి అనుమతించారు.ఈ క్రమంలో ప్రధాన గేటు వద్ద ముందుగా వెళ్తున్న భక్తుల మధ్య తోపులాట జరిగింది. అంతే పలువురు కిందపడటంతో ఒక్కసారిగా ఘోరం జరిగింది. కొంతసేపు భక్తులను క్యూలైన్లలోకి అనుమతించకుండా నిలిపివేసి సహాయ కార్యక్రమాలు చేపట్టడంతో ప్రాణనష్టం తగ్గింది. గాయపడిన భక్తులను పోలీసులే అంబులెన్స్‌లో చేర్చి వెంటనే స్విమ్స్, రుయాకు తరలించారు.
తిరుపతిలోని పలు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులను అనుమతించారు. అయితే బైరాగిపట్టెడలో అందుకు భిన్నంగా వ్యవహరించారు. దీంతో తొక్కిసలాట జరిగిందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కౌంటర్ వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న డీఎస్పీ రమణకుమార్‌కు రహదారి పొడవునా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. అయితే ఏమీ జరగదులే అన్న ధీమాతో బారికేడ్లు ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. భక్తులను పార్కులో ఉంచి ఒకేసారి అనుమతించడంతో ప్రాణనష్టం జరిగిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా టోకెన్లు జారీ చేసే కేంద్రాలను టీటీడీ, పోలీసులు పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. చివరకు అమలు చేయడంలో ఘోరంగా విఫలమై ఆరుగురు ప్రాణాలు పోయేందుకు కారకులయ్యారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తోపులాట జరిగినా తప్పిన ప్రమాదం
జీవకోనలోని సత్యనారాయణపురం టోకెన్ల జారీ కేంద్రంలో మొదట తొక్కిసలాట, తోపులాట జరిగింది. ఘటన జరిగిన వెంటనే సమస్యను గుర్తించిన పోలీసు, టీటీడీ యంత్రాంగం అప్రమత్తమైంది. క్యూలోకి ప్రవేశించే వారిని అదుపు చేస్తూ వచ్చింది. ప్రతి 500 మందిని వేరుచేసి క్యూలోకి అనుమతించడం మొదలుపెట్టారు. ఈలోపు ఎస్పీ సుబ్బారాయుడు అక్కడకు చేరుకొని ప్రతి బృందానికి మధ్య కొంత సమయం తీసుకుని పంపేలా ఆదేశించారు. దీంతో ఎలాంటి తోపులాటలు లేకుండా భక్తులు లోపలకు వెళ్లారు.