స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, కలిసుందాం రా” వంటి సూపర్‌హిట్ చిత్రాలకు కథా రచయితగాను, ప్రభాస్ పరిచయ చిత్రం “ఈశ్వర్”కి స్టోరీ స్క్రీన్‌ప్లే రైటర్‌గా… “సర్దుకుపోదాం రండి” సినిమాకి ఎస్వీ కృష్ణారెడ్డితో, “లాహిరి లాహిరి లాహిరిలో” చిత్రానికి వైవిఎస్ చౌదరితో కో-రైటర్‌గా పనిచేసి మొదటిసారిగా “భారతీయన్స్” చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ప్రముఖ రచయిత దీనరాజ్. సెన్సార్ సంకెళ్లు తెంచుకున్న ఈ చిత్రం ఈనెల 14న తెలుగు – హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా పడిన కష్టాల గురించి దర్శకుడు దీనరాజ్ మాట్లాడుతూ…”చైనా బోర్డర్‌లో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి షూటింగ్ చేసుకున్న తెలుగు చిత్రం “భారతీయన్స్”. డ్రోన్స్‌తో షూట్ చేయడానికి, బాంబ్ పేలుళ్లు జరపడానికి, అడవుల్లో షూటింగ్‌కు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్నాం. వర్షాలు కురిసి, కొండచరియలు విరిగిపడి ఎప్పుడు షూటింగ్ ఆగిపోతుందో తెలియని పరిస్థితుల్లో షూటింగ్ చేశాం. ఒక్కోసారి మధ్యాహ్నం 2 గంటలకే లైటింగ్ ఫెయిల్ అయి షూటింగ్ చేయలేకపోయేవాళ్ళం. చిత్ర యూనిట్ సభ్యులకు ఈశాన్య రాష్ట్రాల ఫుడ్ సరిపడకపోవడంతో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేవి. కొండచరియలతోపాటు.. చెట్లు విరిగి మా కార్లమీద పడడంతో కొందరు యూనిట్ సభ్యులు బతుకు జీవుడా అని దొరికిన వాహనాన్ని పట్టుకుని హైదరాబాద్ వచ్చేశారు. షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక లోకల్ కారు డ్రైవర్ తాగి గొడవ చేస్తుంటే… హైదరాబాద్ మేనేజర్ అతన్ని కొట్టాడు. దాంతో లోకల్ రౌడీషీటర్ ఎంటరై షూటింగ్ ఆపేస్తానని ఆవేశంతో రెచ్చిపోయాడు. ఆ రౌడీషీటర్‌ని సముదాయించి, సినిమాలో చిన్న వేషం ఇచ్చి ఆ సమస్యను ఎలాగో పరిష్కరించాం.
ఎన్ని కష్టాలు పడితే ఏంటి? తెలుగు వాళ్లు గర్వపడే సినిమా తీశాం. జూలై 14వ తేదీన విడుదల కాబోతున్న మా సినిమాని చూశాక మీరంతా మమ్మల్ని కచ్చితంగా అభినందిస్తారనే నమ్మకం మాకుంది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, “కశ్మీర్ ఫైల్స్” దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి “భారతీయన్స్” చిత్రంపై ప్రశంసలు కురిపించడం మేము పడ్డ కష్టం అంతా మర్చిపోయేలా చేసింది. అలాగే… ఇప్పటివరకు మేము వేసిన “ప్రీమియర్ షోస్” అన్నిటికీ అసాధారణ స్పందన వచ్చింది. నూటికి నూరు శాతం మనస్పూర్తిగా మెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా మాజీ సైనికులు “భారతీయన్స్” చిత్రం చూసి ఎంతో భావోద్వేగాలకు లోనై మమ్మల్ని అభినందించడం మేము ఎప్పటికీ మర్చిపోలేం” అన్నారు.


