ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న లీడర్లకు మళ్లీ ఎదురు చూపులు తప్పడం లేదు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమకు ఏదో ఒక పదవి దక్కుతుందని ఆశపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా లీడర్లకు నామినేటెడ్ పోస్టులపై పడిగాపులు తప్పడం లేదు. కొందరు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు కోరుకుంటుండగా.. మరికొందరు జిల్లా స్థాయి పోస్టులపై కన్నేశారు. మార్కెట్ కమిటీ, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల నుంచి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు కోరుతున్నారు. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసినా అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. ఆ జాబితాలో ఉన్నవారిలో కూడా టెన్షన్ మొదలయింది. ఇప్పటి వరకు పోస్టులు కోరుకుంటున్న కాంగ్రెస్ నేతల్లో కొందరినే పదవులు వరించాయి.
వైరాకు చెందిన నాయుడు సత్యనారాయణకు హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్, నూతి శ్రీకాంత్ కు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. వీరిద్దరూ వైరాకు చెందిన వారైనా హైదరాబాద్ లో స్థిరపడి అక్కడి పాలిటిక్స్‌లో ఉన్నారు. ఇక సత్తుపల్లికి చెందిన మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబుకు విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ గా, పాలేరుకు చెందిన రాయల నాగే శ్వరరావుకు గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవులు దక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా 37మందిని నామినేటెడ్ పోస్టుల్లో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురికి రాష్ట్ర స్థాయి పదవులు దక్కాయి. పార్లమెంట్ ఎన్నికల అనంతరం వీరు పదవి స్వీకారం చేస్తారని ప్రచారం జరిగినా అదిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో మార్పులు చేర్పులు ఉంటాయనే ఊహాగానాలు తలెత్తుతున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కొంత మందికి పదవులు కట్టబెట్టినా ఇంకా పదుల సంఖ్యలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసిన లీడర్లు, జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల అనుచరులు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. పదవులు ఆశిస్తున్న వారిలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావెద్, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరులు సాధు రమేష్‌రెడ్డి, కమర్తపు మురళి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు బొర్రా రాజశేఖర్ ఉన్నారు. పలువురు సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వ రరావు, నాగ సీతారాములు, మిక్కిలినేని నరేంద్ర, విజయాబాయితో పాటు కొందరు నేతలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని.. మరికొందరు ఏదో ఒక పదవి వస్తుందని ఆశ పడుతున్నారు. వీరే కాకుండా నియోజకవర్గ స్థాయి నాయకులు చాలా మంది మార్కెట్ కమిటీలు, ఆలయ చైర్మన్ల పదవులు, ఇతర మండల స్థాయి పదవులు కోరుకుంటున్నారు.
పార్టీ అధికారం చేపట్టినందున తమకు పదవులు వస్తాయని భావించిన నేతలు ఇప్పుడు పదవులు దక్కకపోవడంతో నిరాశలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున మూడు నెలలు ఆగవలసి వచ్చింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసినా కూడా నామినేటడ్ పోస్టులపై కాంగ్రెస్ అధిష్టానం నుండి ఎటువంటి ప్రకటన వెలువడకపోవ డంతో సందిగ్ధంలో పడ్డారు. ఈసారైనా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన తమకు ఏదో ఒక పదవి కట్టబెడతారనే నమ్మకంతో ఉన్నారు. ఇంతమంది ఆశావాహుల్లో ఎవరిని నామినేటెడ్ పోస్టు వరిస్తుందో.. అధిష్టానం ఎవరికి ఏ పదవి కట్టబెడుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.