ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ హయాంలో మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన దిశ పోలీస్ స్టేషన్ల పేర్లు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా పేరు మార్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. హోంమంత్రి అనిత దిశ పోలీస్ స్టేషన్‌ల పేర్ల మార్పుపై రెండు నెలల క్రితమే క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న దిశ పోలీస్ స్టేషన్ల పేర్లను మారుస్తామని చెప్పారు. తాజాగా పేర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
2014-2019 మధ్య టీడీపీ హయాంలో మహిళా పోలీస్ స్టేషన్‌లు ఉండేవి. అయితే గత వైసీపీ ప్రభుత్వం వాటిని దిశ పోలీస్ స్టేషన్లుగా పేరు మార్చింది. మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో దిశ చట్టం, యాప్, పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చినట్లు అప్పటి ప్రభుత్వం తెలిపింది. అయితే దిశ చట్టానికి కేంద్రం నుంచి క్లియరన్స్ మాత్రం రాలేదు. తాజాగా దిశ పోలీస్ స్టేషన్ల పేరును మార్చుతూ ఎన్డీయే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.