చైనాలో వేగంగా విస్తరిస్తోన్న HMPV కేసులు భారత్‌లోనూ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా గుజరాత్‌లో మరో కేసు బయటపడింది. ఇప్పటి వరకూ బాధితులంతా చిన్నారులే కాగా.. తొలిసారి ఓ వృద్ధుడికి ఈ వైరస్ సోకింది. అహ్మదాబాద్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడికి హెచ్ఎంపీవీ వైరస్ నిర్దారణ అయ్యింది. దీంతో గుజరాత్‌లో HMPV కేసుల సంఖ్య మూడుకు చేరుకోగా.. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 9కు చేరింది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటన ప్రకారం.. ఆస్తమాతో బాధపడుతున్న వృద్ధుడు కొద్ది రోజుల కిందట అనారోగ్యానికి గురయ్యాడు. అతడ్ని కుటుంబసభ్యులు బుధవారం ఆసుపత్రిలో చేర్పించగా.. గురువారం నిర్వహించిన పరీక్షల్లో HMPV వైరస్ బారిన పడినట్లు తేలింది.
HMPV వైరస్ ఎక్కువగా వృద్ధులు, చిన్నారులపై ప్రభావం చూపుతుంది. వృద్ధులలో తేలికపాటి నుంచి తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. వైరస్ సంక్రమించిన వ్యక్తిలో సాధారణంగా దగ్గు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, శ్వాస ఆడకపోవడం, జ్వరం, అలసట వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక, పిల్లల విషయానికి వస్తే సాధారణంగా తేలికపాటి జలుబు లాంటి సంకేతాల నుంచి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి లక్షణాలు గుర్తించారు. వైరస్ తీవ్రత బ్రాంకైటీస్ లేదా న్యుమోనియాకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రోగనిరోధకశక్తి బలహీనంగా ఉండేవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు.
దేశంలో మొదటిసారి బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ నిర్దారణ అయ్యింది. తర్వాత చెన్నై, గుజరాత్, నాగ్‌పూర్, ముంబయిలో కేసులు బయటపడ్డాయి. అయితే ఈ వైరస్ కొత్తదేమీ కాదని పాతదేనని ఆందోళన చెందాల్సిన పనిలేదని డాక్టర్లు చెప్తున్నారు.