కొవ్వూరు టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయా? ఎమ్మెల్యేకు, కొత్తగా పార్టీలో చేరిన నాయకుడికి మధ్యలో వర్గ పోరు నడుస్తోందా? అంటూ అవుననే సమాధానమే వస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు అంటే టీడీపీకి కంచుకోట లాంటిది. టీడీపీ ఆవిర్భావం నుంచి.. 1999, 2019 మినహా అన్ని ఎన్నికల్లోనూ పసుపు జెండానే ఇక్కడ ఎగిరింది. వైఎస్ఆర్ హవా రాష్ట్రమంతటా నడుస్తున్న సమయంలో కూడా 2004, 2009లో కొవ్వూరులో టీడీపీ ఎమ్మెల్యేనే విజయం సాధించారంటే.. ఇక్కడ టీడీపీ ప్రభావం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కొవ్వూరులో ఎమ్మెల్యేగా ఎవరు గెలిచినా.. దొమ్మేరు జమీందార్లుగా పేరున్న పెండ్యాల వెంకట కృష్ణారావు, ఆయన సోదరుడు అచ్చిబాబు మాటే చెల్లుబాటు అయ్యేది. వెంకట కృష్ణారావు.. కొవ్వూరు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2009 నుంచి కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో.. పెండ్యాల కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడానికి వీల్లేకుండా పోయింది.
2009లో తెలుగుదేశం తరపున టీవీ రామారావు, 2014లో అదే టీడీపీ తరపున కేఎస్ జవహర్ గెలుపొందారు. ఇక 2019లో వైసీపీ నుంచి తానేటి వనిత గెలవగా.. 2024లో తిరిగి టీడీపీ నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. అయితే వీరిందరి గెలుపు వెనుక ఉన్నది పెండ్యాల కుటుంబమే అనేది కొవ్వూరులో బహిరంగ రహస్యమే. దాదాపు 23 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పని చేసిన పెండ్యాల కృష్ణబాబు.. 2012లో వైసీపీలో చేరారు. ఆయన పార్టీని వీడటంతో కంగారు పడిన టీడీపీ అధిష్టానం.. ఆయన సోదరుడు అచ్చిబాబును పార్టీలోనే ఉండేలా కాపాడుకుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కేఎస్ జవహర్ టీడీపీ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. ఈయన గెలుపు వెనుక అచ్చిబాబు ఉన్నారు. ఇక 2019లో తానేటి వనిత గెలిచారు. ఆమె ఏకంగా హోం మంత్రి అయ్యారు. ఈమె గెలుపు వెనుక కృష్ణబాబు అల్లుడు రాజీవ్ కృష్ణ ఉన్నారనే టాక్ వినిపించింది. అప్పట్లో రాజీవ్ కృష్ణ వైసీపీలో ఒక వెలుగు వెలిగారు. అయితే 2024లో టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరావు గెలవడంతో మళ్లీ అచ్చిబాబు శకం మొదలైంది.
నిరుడు మార్చిలో కృష్ణబాబు మృతి చెందారు. దీంతో ఎన్నికల అనంతరం ఆయన అల్లుడు రాజీవ్ కృష్ణ టీడీపీ గూటికి చేరారు. ఇక అప్పటి నుంచే టీడీపీలో వర్గ పోరు మొదలైందనే చర్చ జరుగుతోంది. తనకు తెలియకుండానే రాజీవ్ కృష్ణను పార్టీలో చేర్చుకున్నారని స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధిష్టానం వైఖరితో అచ్చిబాబు కూడా అలకబూనారట. వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. అప్పుడు రాజీవ్ కృష్ణ వైసీపీలోనే ఉన్నారని అచ్చిబాబు గుర్తు చేస్తున్నారట. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలపై అనేక కేసును నమోదు చేయించిన వ్యక్తిని.. ఇప్పుడు టీడీపీలో చేర్చుకోవడంపై వారు మనస్థాపం చెందారట. ఎవరైతే తమను ఇబ్బంది పెట్టారో.. వారికే పార్టీలో పెద్ద పీట వేయడం ఏంటని వారు వాపోతున్నారట.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు టికెట్ ఆశించిన మాజీ మంత్రి జవహర్‌కు ఆశాభంగం కలిగింది. ఆయనను కొవ్వూరు టీడీపీలోని ఒక వర్గం మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఇక ఇప్పుడు జవహర్, రాజీవ్ కృష్ణ ఒక్కటయ్యారట. వారిద్దరూ కలసి టీడీపీలో రాజకీయ మొదలుపెట్టారట. ఇటీవల సంక్రాంతి ఆశీస్సులు అంటూ వారిద్దరి ఫొటోలతో ఫ్లెక్సీలు కూడా వెలిశాయట. దీంతో ఎమ్మెల్యే ముప్పిడి వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొత్తగా వచ్చిన వ్యక్తులు ఏకమయ్యి గ్రూపులు కడుతున్నా.. అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారట. రోజు రోజుకూ ఈ కుమ్ములాటలు పెరిగిపోతుండటంతో అధిష్టానం తలలు పట్టుకుంటుందట.
వాస్తవానికి జవహర్, రాజీవ్ కృష్ణ వర్గానికి.. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, అచ్చిబాబు వర్గానికి పడటం లేదని సీఎం చంద్రబాబు వద్దకు సమాచారం వెళ్లిందట. అయితే కాలక్రమేనా అవన్నీ సర్థుకుంటాయని పార్టీ హైకమాండ్ భావించిందట. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం రోజురోజుకూ ఈ వర్గ విభేదాలు పెరిగిపోతున్నాయట. అంతా చల్లబడింది అనుకున్న సమయంలో కొవ్వూరులో కొత్త గ్రూపులు బయలుదేరడం నియోజకవర్గంలో కుమ్ములాట్లకు కారణమైందట. వైసీపీని ఇబ్బందులు పెట్టాలనుకునే ప్రయత్నంలో.. ఆ పార్టీ నాయకులను ఆకర్షించి సొంత పార్టీలో చేర్చుకోవడమే కుమ్ములాట్లకు కారణం అవుతోందనే టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి వైసీపీని ఇబ్బంది పెట్టబోయి.. సొంత పార్టీలోనే టీడీపీ చిచ్చుపెట్టుకుంది. హైకమాండ్ వెంటనే ఈ తగాదాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే.. పార్టీకి కంచుకోటగా ఉన్న కొవ్వూరులో టీడీపీ చేజారిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు.