ఒకప్పుడు సంపదతో తులతూగిన అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరం నేడు మరుభూమిని తలపిస్తోంది. కార్చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. ఇప్పటివరకూ 10 మంది ప్రాణాలు కోల్పోయారు. లాస్ ఏంజెల్స్ అంతటా మంటలను చల్లార్చేందుకు సిబ్బంది పోరాడుతుంటే.. వారికి పెద్ద సవాల్ ఎదురైంది. కొన్ని ప్రాంతాల్లో ఫైర్ హైడ్రెంట్స్ డ్రై అయిపోవడం.. నీటి లభ్యత లేకపోవడంతో మంటలను అదుపు చేయడానికి ఆటంకం ఏర్పడింది.
గత కొన్ని రోజులుగా కార్చిచ్చును ఆర్పేందుకు నీటిని ఎక్కువ స్థాయిలో వినియోగించారు. లాస్ ఏంజిల్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ (DWP) ఇతర స్థానిక నీటి వ్యవస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. DWP మాజీ జనరల్ మేనేజర్ మార్టిన్ ఆడమ్స్ మాట్లాడుతూ.. నగరంలోని నీటి వ్యవస్థలు ఈ స్థాయిలో కార్చిచ్చును ఎదుర్కొనేలా రూపొందించబడలేదని చెప్పారు.
పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలో.. అనేక హైడ్రైంట్లు తగినంత నీటిని అందించడంలో విఫలమయ్యాయి. అల్టాడెనా, పసాదేనాలో కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. నీటి స్థాయిలు తక్కువగా ఉండటంతో కార్చిచ్చును అరికట్టడం కష్టతరంగా మారిందని ఫైర్ సిబ్బంది అంటున్నారు.
పసిఫిక్ పాలిసేడ్స్‌లో, స్థానిక నీటి వ్యవస్థ కొండ ప్రాంతాలలో ఉన్న గ్రావిటీ-ఫెడ్ స్టోరేజీ ట్యాంక్‌లపై ఆధారపడి ఉంటుంది. ఈ ట్యాంకులు ఒక్కొక్కటి ఒక మిలియన్ గ్యాలన్‌ల నీటిని నిల్వ ఉంచే సామర్ధ్యంతో రూపొందించబడ్డాయి. ఇవి దిగువన ఉన్న హైడ్రాంట్‌లకు నీటిని సరఫరా చేస్తాయి. అయినా దావనంలా వ్యాపించిన కార్చిచ్చు కారణంగా నీటి ట్యాంకులు ఖాళీ అయ్యాయి. పాలిసాడ్స్ హైలాండ్స్ వంటి ఎత్తైన పరిసరాలలో హైడ్రెంట్‌లు డ్రై అవడానికి కారణమయ్యాయి. DWP అధికారి మాట్లాడుతూ.. నీటి డిమాండ్ సాధారణ రేటు కంటే నాలుగు రెట్లు పెరగడంతో సమస్య మరింత తీవ్రమైందని చెప్పారు.
సమీపంలోని DWP రిజర్వాయర్ పనిచేయకపోవడం వల్ల సమస్య పరిష్కారం మరింత కష్టతరంగా మారిందని అంటున్నారు. నీటి లభ్యత ఎలా ఉండబోతుందోనని అధికారులు ఆరా తీస్తున్నారు. కార్చిచ్చు అధికంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ ట్రక్కులను పంపించినా.. లాజిస్టికల్ సవాళ్లతో నియంత్రణ చర్యలకు ఆటకం ఏర్పడుతోంది.
మరోవైపు అల్టాడెనా , పసాదేనాలలో కరెంటు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ ప్రాంతాల్లో నీటిని సరఫరా చేస్తున్న సప్లయర్స్..విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా పంపులపై ప్రభావం పడడంతో నీటి ప్రెజర్‌ని కొనసాగించలేకపోతున్నారు. పడిపోయిన విద్యుత్ తీగలు, లైన్ల నుంచి అగ్నిమాపక సిబ్బందిని రక్షించడానికి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్టు తెలుస్తోంది.
కాగా..కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ నీటి సరఫరా వైఫల్యాలపై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించారు. DWP, స్థానిక నీటి సంస్థల సంసిద్ధత, తీసుకున్న చర్యలపై దర్యాప్తు సంస్థ నివేదిక ఇవ్వనుంది. మరోవైపు అగ్నిమాపక శాఖ వనరులకు బడ్జెట్ కోతలపై మేయర్ కరెన్ బాస్‌తో సహా లాస్ ఏంజిల్స్ నగర నాయకులు విమర్శలను ఎదుర్కొంటున్నారు.
భవిష్యత్తులో ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవాలంటే నిపుణులు కొన్ని విధానాలను ప్రతిపాదించారు. హై రిస్క్ ఉన్న ప్రాంతాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని విస్తరించడం, అధిక డిమాండ్‌ను ఎదుర్కోవడానికి పైప్‌లైన్‌లను అప్‌గ్రేడ్ చేయడం , పంపుల కోసం బ్యాకప్ పవర్ సిస్టమ్‌లలో పెట్టుబడి పెట్టడం వంటి వాటిని ప్రతిపాదించారు.