అంతర్జాతీయ కేసులు అంత త్వరగా ఒక కొలిక్కి రావడం లేదు. సంవత్సరాల తరబడి కోర్టుల్లో కేసులు పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేసులు సత్వరంగా విచారించాలని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందుకు అనుగుణంగా ఒక సరికొత్త పోర్టల్‌ను తీసుకువచ్చింది. అదే భారత్ పోల్ పోర్టల్. తాజాగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భారత్ పోల్ పోర్టల్ ను ఆవిష్కరించారు.
భారత్‌పోల్ పోర్టల్ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. నేరస్తులను అదుపులోకి తీసుకోవడానికి ఈ భారత్‌పోల్ పోర్టల్ ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ఈ పోర్టల్‌తో అంతర్జాతీయ కేసుల విషయంలో కొత్త శకం ప్రారంభమైనట్లేనన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా.
అంతర్జాతీయ కేసుల్లో నిందితులుగా అనేకమంది ఇటీవలికాలంలో పరారీలో ఉన్నారు. దర్యాప్తు సంస్థలకు అందుబాటులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో సరికొత్త సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకుని, సదరు నేరగాళ్లను అదుపులోకి తీసుకోవడానికి భారత్ పోల్ పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రధానంగా దర్యాప్తు సంస్థలు…వేగవంతంగా అంతర్జాతీయ సహకారం తీసుకోవడానికి ఈ కొత్త పోర్టల్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. కాగా భారత్ పోల్ పోర్టల్ రూపకల్పనలో సీబీఐ సహకారం ఎంతగానో ఉంది. కేంద్రం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన దర్యాప్తు సంస్థలు, అంతర్జాతీయ ఇంటర్‌పోల్‌తో చాలా సులభంగా అనుసంధానం అయ్యేందుకు భారత్ పోల్ పోర్టల్ వీలు కల్పిస్తుంది.
వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా తీవ్రస్థాయి నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులు తెలివి మీరారు. మోడరన్ టెక్నాలజీ సాయంతో తాము ఎక్కడ ఉన్నదీ తెలియకుండా వ్యవహరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాళ్లు విసురుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నేరగాళ్ల ఎత్తుగడలకు కౌంటర్ వేయాల్సిన అవసరం దర్యాప్తు సంస్థలకు ఏర్పడింది. దీంతో నేరగాళ్ల ఆట కట్టించడానికి మోడర్న్ టెక్నాలజీని అంది పుచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దిశగా నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వేసింది. అదే భారత్ పోల్ పోర్టల్. మొత్తంమీద భారత్ పోల్ పోర్టల్ వ్యవస్థతో అంతర్జాతీయ కేసులను సత్వరమే విచారిస్తామన్న ధీమా దర్యాప్తు సంస్థలు వెల్లడిస్తున్నాయి.