ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు తాజాగా షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి పదో తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. మొత్తం 70 నియోజకవర్గాల్లో ఒకే దశలో ఫిబ్రవరి ఐదో తేదీన ఎన్నికలు జరుగుతాయి.కాగా ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. షెడ్యూల్ విడుదల సందర్భంగా ఈవీఎంలపై వచ్చిన ఆరోపణలను సీఈసీ రాజీవ్ కుమార్ తోసిపుచ్చారు. యువత ఈ ఎన్నికల్లో స్వేచ్చగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
ఢిల్లీ శాసనసభ పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుంది. దీంతో ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజేంద్ర కుమార్ కు ఇది చివరి అసైన్‌మెంట్. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన రిటైర్ కాబోతున్నారు. అంతేకాదు ఈ ఏడాది జరగనున్న తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే మొత్తం 70 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా కేజ్రీవాల్‌పై బీజేపీ టికెట్‌పై పర్వేష్ సాహిబ్ వర్మ పోటీ చేస్తున్నారు. అలాగే కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఆతీశీ పోటీ చేస్తున్నారు. కాగా ఇక్కడ్నుంచి బీజేపీ టికెట్‌పై రమేష్ బిధూరీ పోటీ చేస్తున్నారు.
ఢిల్లీలో కొంతకాలం కిందటే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రెండు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించాయి. ఢిల్లీలో వరుసగా రెండు టర్మ్‌లు ఆమ్ ఆద్మీ పార్టీయే అధికారంలో కొనసాగుతోంది. 2020 ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 70 నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లు దక్కించుకుంది. బీజేపీ కేవలం ఎనిమిది సీట్లకే పరిమితమైంది. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఒక్క సీటు కూడా దక్కలేదు. మూడోసారి కూడా విజయకేతనం ఎగరేయాలని ఆప్ గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా ఢిల్లీ ఎన్నికలకు కేజ్రీవాల్ చాలా కిందటే కసరత్తు ప్రారంభించారు. సీనియర్ సిటిజన్లకు అలాగే మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. సంక్షేమ పథకాలతో ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.
అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా దెబ్బతింది. ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్కదాంట్లోనూ ఆప్ విజయం సాధించలేకపోయింది.కాగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ కొంతకాలం కిందట మద్యం కుంభకోణంలో చిక్కుకున్నారు. కేజ్రీవాల్‌పై ఈడీ, సీబీఐ కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదు కావడంతో ఆయన జైలుకు కూడా వెళ్లారు. అయితే జైలు నుంచి బెయిల్ పై వచ్చిన తరువాత కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో కేజ్రీవాల్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న అతీశీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోవడాన్ని బీజేపీ గమనించింది.ఇందుకు కౌంటర్‌గా అభివృద్ధి మంత్రను ఆలపిస్తోంది. ఇటీవల ఢిల్లీలోని అశోక్ విహార్‌లోని రామ్‌లీలా గ్రౌండ్‌లో బీజేపీ మొదటి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
అలాగే అశోక్ విహార్‌లోని జైలర్‌వాలా బాగ్‌లో ఇన్‌స్టిట్యూట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద నిర్మించిన 1,675 ఫ్లాట్‌లను లబ్దిదారులకు ప్రధాని నరేంద్ర మోడీ అందచేశారు. స్వాభిమాన్ అపార్ట్‌మెంట్స్ పేరుతో …ఈ ఫ్లాట్స్ ను నిర్మించారు. తనకు అద్దాల మేడ లేకపోయినా,మురికివాడల నిర్వాసితులకు గౌరవప్రదమైన ఇండ్లను అందించడంలో భాగంగా ఇన్‌స్టిట్యూట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఢిల్లీ అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీని పరోక్షంగా ప్రస్తావిస్తూ నరేంద్ర మోడీ చురకలు వేశారు.
ఇదిలాఉంటే, ఢిల్లీ ఎన్నికల్లో దాదాపుగా ఒంటరిపోరుకు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమైంది. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీతో దాదాపుగా తెగదెంపులు చేసుకున్నంత పని చేసింది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు తెలియచేసినందుకే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ పేర్కొన్నారు.
మొత్తంమీద తన నిజాయితీయే ఈసారి ఎన్నికలలో ఆప్‌ను గెలిపిస్తుందని అరవింద్ కేజ్రీవాల్ భరసాతో ఉన్నారు. అయితే ఆప్‌ను ఇరుకున పెట్టడానికి మద్యం కుంభకోణాన్ని ఎన్నికల ప్రచారంలో కీలకాంశం చేయడానికి బీజేపీ సన్నాహాలు చేస్తోంది.