ఎలన్ మస్క్…పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం. ఆయన ఏం చేసినా సంచలనమే. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌నకు అనుకూలంగా మస్క్ వ్యవహరించారు. అమెరికా ఎన్నికలలో ట్రంప్ అధ్యక్షుడిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో డొనాల్డ్ ట్రంప్ నకు అత్యంత సన్నిహితుల జాబితాలో ఎలన్ మస్క్ పేరు కూడా చేరింది.
అయితే ఇటీవల ఎలన్ మస్క్ వివాదాల్లో చిక్కుకున్నారు. కొన్ని నెలల నుంచి ప్రపంచ నేతలతో ఎలన్ మస్క్ వివాదాలు పెట్టుకున్నారు. వీరిలో జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ షోల్జ్, ఫ్రాన్స్ అధినేత మేక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఉన్నారు.
టెస్లా అధినేత ఎలన్ మస్క్ తమ దేశ ఎన్నికల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారని ఫ్రాన్స్ అధినేత మేక్రాన్ ఇటీవల ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేయించడానికి మస్క్ కంకణం కట్టుకున్నారని మేక్రాన్ ఘాటు ఆరోపణలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా అధికార మార్పిడి ఉద్యమానికి ఎలన్ మస్క్ మద్దతు పలుకుతున్నారని మేక్రాన్ ఆరోపించారు.
ఫ్రాన్స్ అధినేత మెక్రానే కాదు…బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఎలన్ మస్క్ పై నిప్పులు కురిపించారు. గతంలో కీర్ స్టార్మర్ బ్రిటన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నప్పుడు …గ్రూమింగ్ గ్యాంగుల అరాచకాలను నిరోధించడంలో ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. కథ అక్కడితో ఆగలేదు. .గ్రూమింగ్ గ్యాంగుల గురించి తెలిసి కూడా…సదరు గ్యాంగుల దురాగతాల గురించి చూసీ చూడనట్లు వ్యవహరించారని ఎలన్ మస్క్ ఘాటు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంటును రద్దు చేసి, అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎలన్ మస్క్ డిమాండ్ చేశారు. అయితే ఎలన్ మస్క్ డిమాండ్‌ను బ్రిటన్ ప్రభుత్వం కొట్టి వేసింది. తప్పుడు సమాచారం ఆధారంగా మస్క్ మాట్లాడుతున్నారని బ్రిటన్ మంత్రి ఒకరు కామెంట్ చేశారు.
కాగా ఎలన్ మస్క్ తనపై చేసిన ఆరోపణలను బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తోసిపుచ్చారు. మస్క్ పేరును ప్రస్తావించకుండా తనపై కొంతమంది ప్రముఖులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదిలా ఉంటే ….ఎలన్ మస్క్ పై నార్వే ప్రధాని జోనాస్ కూడా మండిపడ్డారు. ఎలన్ మస్క్ అమెరికా రాజకీయాలకు పరిమితమైతే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. అమెరికా దాటి బయటి దేశాల రాజకీయాల్లో మస్క్ జోక్యం చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆర్థిక వనరులు దండిగా ఉన్న ఎలన్ మస్క్, ఇతర దేశాల అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవడం సమంజసం కాదన్నారు జోనాస్.