21.7 C
Hyderabad
Thursday, January 16, 2025
spot_img

క్షీణించిన ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం

జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం క్షీణించింది. ఆయనను చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రశాంత్ కిశోర్‌ ఇటీవల పాట్నాలోని గాంధీ మైదానంలో నిరుద్యోగులకు మద్దతుగా ఆమరణ దీక్ష చేపట్టారు. ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించిన కంబైన్డ్ కాంపిటీటివ్ సర్వీస్ పరీక్షా పత్రాలు లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. కిందటేడాది డిసెంబర్ 13న పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. అయితే బీహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనలను పట్టించుకోలేదు. పరీక్షను రద్దు చేసే ప్రసక్తేలేదని బీహార్ ప్రభుత్వ ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో జన్‌ సురాజ్ అధినేత ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగారు. విద్యార్థులకు అండగా ప్రశాంత్ కిశోర్ నిలిచారు. పరీక్షలు రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలన్న విద్యార్థుల డిమాండ్‌కు మద్దతుగా ఈ నెల రెండో తేదీన ఆమరణ దీక్ష చేపట్టారు. ప్రశాంత్ కిశోర్ దీక్ష బీహార్ రాజకీయాలలో కలకలం సృష్టించింది.

ప్రశాంత్ కిశోర్ దీక్ష నేపథ్యంలో బీహార్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈనెల ఆరో తేదీన ఆమరణ దీక్షకు అనుమతి లేదంటూ ప్రశాంత్ కిశోర్ దీక్షను పాట్నా పోలీసులు భగ్నం చేశారు. ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఇటువంటి చట్టవ్యతిరేక చర్యలు మరోసారి చేపట్టవద్దని ఆదేశిస్తూ ప్రశాంత్ కిశోర్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్‌ను ప్రశాంత్ కిశోర్ సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆయనను సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ తరువాత కోర్టు షరతులు లేని బెయిల్ మంజూరు చేయడంతో ప్రశాంత్ కిశోర్ జైలు నుంచి విడుదలయ్యారు.

అయితే ప్రశాంత్ కిశోర్ కు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్లు నివేదిక అందింది. ఈ నివేదిక ఆధారంగా చికిత్స కోసం ఆయనను పాట్నాలోని ఒక ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే , గాంధీ మైదానంలో తన దీక్ష భగ్నం చేసిన తరువాత పోలీసులు తనను అనేక చోట్ల తిప్పారని ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తనను వాహనంలో తిప్పుతూనే ఉన్నారన్నారు. ఎక్కడకు తీసుకెళుతున్నారని అడిగితే, సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. తన దీక్ష కు సంబంధించి పోలీసులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కాగా , ప్రశాంత్ కిశోర్ స్వతహాగా రాజకీయ వేత్త కాదు. రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలుపొందడానికి ఉపాయాలు చిట్కాలు చెప్పే పనిని చాలా కాలం పాటు ఆయన విజయవంతంగా కొనసాగించారు. దీంతో పొలిటికల్ స్ట్రాటజిస్టుగా ఆయన రాజకీయ వర్గాల్లో పాపులర్ అయ్యారు. ఎన్నికల వ్యూహకర్తగా ఒక్క వామపక్షాలకు మినహా దాదాపుగా ఆయన అన్ని రాజకీయ పార్టీలకు ఆయన సేవలందించారు. అయితే 2017లో ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ కూటమికి ప్రశాంత్ కిశోర్ సేవలందించారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ కూటమి ఓటమి పాలైంది. ఇదొక్కటే ప్రశాంత్ కిశోర్ పొలిటికల్ స్ట్రాటజిస్టు కెరీర్‌లో మైనస్ పాయింట్.

దాదాపు నాలుగు నెలల కిందట ప్రశాంత్ కిశోర్ వేషం మార్చారు.కిందటేడాది అక్టోబరు రెండో తేదీన జన్‌ సురాజ్ పేరుతో ప్రశాంత్ కిశోర్ ఓ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తరువాత చాలా కాలం పాటు బీహార్ గ్రామీణ ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ప్రధానంగా యువతను ఇష్టాగోష్టి సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వాల నుంచి బీహార్ యువత ఏం కోరుకుంటుందో ప్రశాంత్ కిశోర్ అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో యువతకు మద్దతుగా పేపర్ లీకేజీ అంశంపై ఆయన పోరాటం మొదలుపెట్టారు.

కాగా ప్రశాంత్ కిశోర్ ప్రస్తుత రాజకీయాలకు ఒక వ్యూహం ఉందంటున్నారు పొలిటికల్ పండితులు. ప్రశాంత్ కిశోర్ మొదటినుంచి నితీశ్ కుమార్‌ను టార్గెట్‌ గా చేసుకునే రాజకీయాలు చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో కి రావడం ఇదే తొలిసారి కాదు. దాదాపు ఏడేళ్ల కింద‌ట ..నితీశ్ కుమార్ నాయ‌క‌త్వంలోని జనతాదళ్ యునైటెడ్ పార్టీలో ఆయ‌న చేరారు. అప్పట్లో ప్రశాంత్ కిశోర్‌కు జేడీ యూ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. కొంతకాలం నితీశ్ కుమార్, ప్రశాంత్ కిశోర్ కలిసి పనిచేశారు. అయితే ఒక ద‌శ‌లో నితీశ్ కుమార్‌తో ప్ర‌శాంత్ కిశోర్ కు విభేదాలు తలెత్తాయి. దీంతో ప‌ట్టుమ‌ని ప‌ద‌హారు నెలల్లోనే జనతాదళ్ యునైటెడ్ పార్టీ నుంచి ప్రశాంత్ కిశోర్ బయటకు రావ‌ల‌సి వ‌చ్చింది. అప్పటి నుంచి నితీశ్‌ కుమార్‌ ను టార్గెట్ చేసుకుని ప్రశాంత్ కిశోర్ రాజకీయాలు చేయడం మొదలెట్టారు.

Latest Articles

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ అభివృద్ధికి సహకరించండి- శ్రీధర్‌బాబు

'కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్క్యూట్‌గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్