భారత వ్యతిరేక చర్యలతో నిత్యం వార్తల్లో నిలిచిన కెనడాలోని ట్రూడో ప్రభుత్వం ఇప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది. ఖలిస్తాన్ వేర్పాటు వాదులను దేశంలోనే అణిచివేయకుండా వారికి ఆశ్రయం ఇస్తూ.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిన జస్టిన్ ట్రూడో ఇప్పుడు తన ప్రధాన మంత్రి పదవికి రాజనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొద్ది రోజులుగా సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదర్కొంటున్న ట్రూడో రాజీనామా ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
జస్టిన్ ట్రూడో… రెండేళ్ల కింది వరకు ఈ పేరు పెద్దగా ఎవ్వరికీ తెలియదు. కనీసం కెనడా ప్రధాని అని ఎవ్వరికీ గుర్తుకూడా లేదు. కానీ కెనడాలో ఎన్నికలకు రెండేళ్ల ముందే తన పార్టీ పరిస్థితిని.. కెనడాలో తన ప్రాధాన్యత తగ్గిపోతుందని గుర్తించారు ట్రూడో. దీంతో దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కన పెట్టి.. ప్రజల దృష్టిని మరల్చేందుకు భారత వ్యతిరేక స్వరం అందుకున్నారు. భారత వేర్పాటు వాదులతో జట్టుకట్టి..వారికి అండగా నిలిచారు. ఖలిస్తాన్ వేర్పాటు వాదులకు ఆశ్రయం ఇచ్చి.. ఇప్పుడు తన పదవికే ఎసరు తెచ్చుకున్నారు.
ప్రపంచంలో కెనడాకు మంచి పేరుంది. కెనడాలో శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని ప్రపంచంలోని చాలా దేశాలు విశ్వసిస్తాయి. ఉగ్రవాదులకు,వేర్పాటు వాదులకు మిత్రదేశాలకు హాని చేసే ఎలాంటి శక్తులకు కెనడాలో తావు ఉండదన్న వాదన ఉండేది. కెనడాలోని గత పాలకులంతా ఇలాంటి వైఖరినే అవలంభించారు. దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేందుకు విదేశీ మానవనరుల సాయం తీసుకుని.. కెనడాను ఆర్థికంగా బలోపేతం చేశారు. అయితే వాళ్ల తర్వాత వచ్చిన జస్టిన్ ట్రోడో మాత్రం.. కెనడా ప్రతిష్టను అంతర్జాతీయంగా దిగజార్చారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి.. వారిని మెదళ్లను పక్కదోవ పట్టించారు.
నిజానికి కెనడా చాలా ఏళ్లుగా అనేక సమస్యలతో సతమతమవుతోంది. అమెరికాతో సుదీర్ఘ సరిహద్దు రేఖను కలిగి ఉన్న కెనడా.. చాలా విషయాల్లో అమెరికాతో పోటీ పడుతోంది. సువిశాల కెనడాలో అపారమైన వనరులున్నాయి. భారత్ పోల్చితే దాదాపు 3 రెట్లు ఎక్కువ భూభాగం కలిగి ఉన్న కెనడాలో మానవవనరుల కొరత తీవ్రంగా వేదిస్తోంది. అయితే వాణిజ్యపరమైన పోటీ తట్టుకునేందుకు ఆదేశం ప్రతీ ఏటా విదేశీ నిపుణులను దిగుమతి చేసుకుంటోంది. ఈ విధానంతో కెనడా ఆర్థికంగా బలోపేతం అయ్యింది.
అయితే కెనడాలో మెజార్టీ పరిశ్రమలు రాజధాని ఒటావా, మరో నగరం టొరంటోనే ఉన్నాయి. దీంతో వర్తక వాణిజ్యాలు అన్ని ఇక్కడి నుంచే సాగుతున్నాయి. దేశంలోని ప్రధాన పరిశ్రమలు ఇక్కడే వెలిశాయి. ఇలా దేశ జనాభాలో మెజార్టీ ప్రజలు ఇక్కడే జీవిస్తున్నారు. దీంతో గడిచిన పదేళ్లుగా ఇక్కడ పెద్దఎత్తున గృహసంక్షోభం ఏర్పడింది. జనాభాకు తగినన్ని ఇళ్లు లేకపోవడంతో ఈ రెండు నగరాల్లో అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గడచిన రెండేళ్లుగా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నా.. దీనికి ట్రూడో ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపలేకపోయింది.
చాలా కాలం క్రితమే అక్కడికి వెళ్లిన వారు సొంతిల్లు కొందామంటే ధరలు చూసి వెనకడుగు వేశారు. ఇళ్ల అద్దెలను భరించలేక కెనడాను వదిలేస్తున్నవారి సంఖ్య 28 శాతంగా ఉన్నట్లు ఆంగస్ రీడ్ ఇనిస్టిట్యూట్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ పరిణామాలతో కెనడా ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నో ఆశలతో కెనడాకు వస్తున్న వలసదారులకు సౌకర్యవంతమైన పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందుకే చాలా మంది ఇతర దేశాల వైపు మళ్లుతున్నట్లు పేర్కొంది.
2021 ఎన్నికల సమయంలో కెనడాలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. చాలా మంది కెనడా వాసులు ఇళ్లు కొనలేని పరిస్థితి నెలకొంది. వ్యాపారులు, సంపన్న కార్పొరేట్లు, విదేశీ పెట్టుబడిదారులకు కెనడాలో ఇల్లు లాభసాటిగా మారాయని అప్పట్లో లిబరల్ పార్టీ పేర్కొంది. దీంతో సంపన్నులు, విదేశీ పెట్టుబడిదారులు భారీగా ఇళ్ల కొనుగోళ్లు చేపట్టారని తెలిపింది. ఈ పరిస్థితి కారణంగా ధరలు భారీగా పెరిగాయని వివరణ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో విజయం తర్వాత ట్రూడో పార్టీ అయిన లిబరల్ పార్టీ.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కరం చూడపంలో విఫలం అయిందని మెజార్టీ కెనడియన్లు విశ్వసించారు. మరోవైపు.. కెనడాకు వలసదారులు పెరిగిపోయిన కారణంగా ఇళ్ల సంక్షోభం ఏర్పడిందని 44.5 శాతం మంది కెనడియన్లు అభిప్రాయపడుతున్నారు.
మరో వైపు విదేశీయులు తమ ఉపాధిని కొల్లగొడుతున్నారన్న అపోహ కెనడియన్ ప్రజల్లో బలంగా ఉండిపోయింది. నిజానికి ట్రూడో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పారిశ్రామిక రంగానికి పెద్దగా ఊతమిచ్చే ప్రయత్నాలు చేయలేదు. దీంతో ఉన్న పరిశ్రమల్లోని ఉద్యోగాలను తక్కువ వేతనాలకే విదేశీయులు కొల్లగొట్టడం ప్రారంభించారు. దీంతో కెనడాలో నిరుద్యోరేటు పెరిగిపోయింది. ఇలా అనేక సమస్యల నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు ట్రూడో నిజ్జర్ హత్యను రాజకీయ అస్త్రంగా వాడుకున్నారు. విదేశీ శక్తులు కెనడా గడ్డపై రాజకీయాలు చేస్తున్నాయని… భారత్ ను నిందించారు. అయితే కెనడా ఆర్థికంగా పుంజుకునేందుకు అపారమైన మానవ వనరులను అందించిన భారత్ పై ట్రూడో నిందలు వేయడంతో సొంత పార్టీ నుంచే ఆయనపై వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ వ్యతిరేకతే ఆయన రాజీమానాకు కారణమైయ్యేలా చేసింది.