ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిర్యాదుదారుడు, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేశారు. దీని ఆధారంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR, పురపాలకశాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌కు నోటీసులిచ్చే అవకాశం ఉంది. ఈమేరకు ఏసీబీ సిద్ధమవుతోంది.
ఫార్ములా ఈ-రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీసంస్థకు సొమ్ము చెల్లించారంటూ దానకిశోర్ ఏసీబీకి ఈ ఏడాది అక్టోబరు 18న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి 55 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. BRS హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా వ్యవహరించిన KTRను A1గా పేర్కొంటూ తెలంగాణ ఏసీబీ ఇటీవల కేసు నమోదు చేసింది. పురపాలకశాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ A2, HMDA అప్పటి చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని A3 FIRలో చేర్చారు.