చాలా మంది కోకిల గొప్పతనాన్ని మెచ్చుకుంటూ.. కాకి గొంతును చాలా మంది అసహ్యించుకుంటారు. కానీ, కాకికి ఉండే గొప్ప గుణాలు, దాని జీవన విధానం, సనాతన దర్మం కాకికి ఇచ్చే ప్రాధాన్యత తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేకువ జామునే అనగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం ఆచరించే పక్షి కాకి. ఈ బంధాలు, ఈ సిరి సంపదలు.. ఏవీ నీవి కావు అంటూ.. తన స్వరంతో కావు… కావు… అంటూ గుర్తు చేస్తాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. అనేక పక్షుల తీరు వేరు.. కాకి జీవన విధానం వేరు. వాటికి ఎక్కడయినా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు కావ్..కావ్ అంటూ సందేశం పంపి గుమిగూడి అన్ని కలసి ఆహారం తింటాయి. సంసారం ఎలా చేయాలో కాకి చెపుతుందని పండితులు చెపుతారు. ఆడ కాకి – మగ కాకి కలవడం కూడా ‘పరుల కంట’ పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయని అంటారు. మనుషులవలె బుద్ది జ్ఞానం లేకపోయినా… ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోధనలు చేస్తాయి. అనంతరం ఏదైనా కొలనులో స్నానమాచరించి గూటికిచేరుతాయి. అలాగే ప్రతిరోజు సమయపాలనను పాటిస్తూ సూర్యాస్తమయం సమయానికి గూటికిచేరే గొప్ప లక్షణం కూడా కాకికి ఉంది. సూర్యాస్తమయం తర్వాతా ఎలాంటి ఆహారాన్ని కూడా కాకులు ముట్టవట.
కాకి పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి పెద్ద వృక్షాలుగా మారుతాయి. అందుకే కాకులు లేని ప్రదేశం లేదు అని అంటారు. అలా ప్రకృతిని సమతౌల్యం చేసే పాత్రకూడా కాకులకు ఉంది. అంతేకాదు పకృతి వైపరీత్యాలు వచ్చే ముందు (తుఫాను, భూకంపాలు,అగ్నిపర్వతాలు) కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి. ఏదైనా గ్రహణం ఏర్పడితే కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి.
సనాతన ధర్మంలో మరో విశిష్టతను కూడా కాకులకు కల్పించారు. మనుష్యులు పితృఋణం తీర్చుకునేందుకు పితృ తర్పణం పెడతారు. ఈ తర్పణాన్ని కాకి ముడితేనే.. పితృదేవతలు సంతోషించినట్లు చెపుతారు. మన పితృదేవతలు కాకి రూపంలో సంచరిస్తారని అంటారు. పూర్వ కాలంలో ఇంటి పరిసరాలలో కాకులు తిరుగుతుంటే.. పెద్దలు వచ్చారని వాటికి ఆహరం, నీళ్లు పెట్టేవారు. అవి తింటే.. స్వయంగా మన పూర్వికులు తిన్నట్లే భావించేవారు. అలాగే ఈ పితృ దేవతలు శాంతి పొందితే.. కుటుంబంలో ఎలాంటి కలహాలు జరగవని, ఆరోగ్య కరమైన సంతానం పుడుతుందని అంటారు. పితృ కార్యాలు చేయని ఇంట్లో ఎప్పుడు అశాంతి నెలకొంటుందని, సంతానం కలుగకుండా పుత్రులు బాధపడుతారని ఈ విషయాన్ని స్వయంగా శాస్త్రం చెబుతుందని పండితులు చెబుతున్నారు. పూర్వకాలంలో భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు.
కాకి జీవితాన్ని వివరించే భారతీయుల సనాతన ధర్మం విశిష్టత, ఆవశ్యకత నేటి సమాజం ఆచరించాల్సినవే. సంఘజీవనం, సేవాతత్పరత, మంచి స్నేహభావాలతో, ఈర్ష్యా ద్వేషాలు లేకుండా కలసి మెలసి అన్యోన్యంగా ప్రేమానురాగాలతో నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాం. ఇంతటి అపూర్వ సమాచారాన్ని వీలైనంత మందికి షేర్ చేయండి.


