ఎలాన్ మస్క్, షివోన్ జిలిస్ బంధం అనూహ్యంగా ముగిసింది. తమ బంధం ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా కేవలం ఒక్క వారంలోనే ముగిసిపోయిందని జిలిస్ వెల్లడించారు. మస్క్‌తో తనకు ఉన్న నలుగురు పిల్లలను ప్రస్తావిస్తూ.. ఈ పరిణామంపై ఆమె భావోద్వేగ నోట్ విడుదల చేశారు.
తన తాజా నోట్‌లో మస్క్‌తో ఇటీవల జరిగిన సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా జిలిస్ పంచుకున్నారు. సెప్టెంబర్ 24న మస్క్ తనను ప్రేమిస్తున్నానని చెప్పినట్లు ఆమె వెల్లడించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే బంధం ముగిసినట్లు జిలిస్ పేర్కొన్నారు. అంతకుముందు మస్క్ ఆమెను ఎక్స్‌లో అన్‌ఫాలో చేయడం కూడా చర్చనీయాంశమైంది.
మస్క్‌తో గడిపిన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ జిలిస్ భావోద్వేగానికి గురయ్యారు. మస్క్‌ను తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని తెలిపారు. తనకు ఎన్నో విషయాలు నేర్పారని, జీవితానికి అర్థాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. బంధం ముగియడంతో ఎంతో కోల్పోయిన భావన కలుగుతోందని చెప్పారు. మస్క్, జిలిస్‌కు 2021లో కవలలు స్ట్రైడర్, అజూర్ జన్మించారు. 2024లో ఆర్కాడియా అనే కుమార్తె, 2025లో మరో కుమారుడు సెల్డన్ జన్మించారు. ఈ నలుగురు పిల్లలను ప్రస్తావిస్తూ.. వారితో కలిసి తన జీవితంలో నాలుగు అందమైన ప్రేమలను సృష్టించుకున్నానని జిలిస్ పేర్కొన్నారు.
అయితే ఈ బంధం ముగింపుపై ఎలాన్ మస్క్ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.
మస్క్‌కు వేర్వేరు భాగస్వాములతో కనీసం 14 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా జిలిస్ చేసిన భావోద్వేగ ప్రకటనతో మస్క్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది.


