తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కలిసింది. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. కేసీఆర్ నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి యత్నించారని ఆరోపించారు. ఎమ్మెల్సీల అక్రమ అరెస్టులతో పాటు ఎమ్మెల్యేలపై కేసులపైనా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు బీఆర్ఎస్ నేతలు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పరిస్థితులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. “రాష్ట్రంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు ఉన్నాయి. బ్లాక్ షర్ట్ వేసుకొని అసెంబ్లీకి వెళితే అడ్డుకున్నారు. బ్లాక్ షర్ట్ వేసుకొని రాహుల్‌గాంధీ పార్లమెంట్‌కు వెళ్లలేదా?. నడిరోడ్డుమీద మా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారు. మా మహిళా సభ్యులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. దాడి చేసి మాపైనే కేసులు పెట్టారు. ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినా..కేసు నమోదు చేయలేదు. ఢిల్లీ పీఠాన్ని కదిలించి తెలంగాణ తెచ్చిన యోధుడు కేసీఆర్. కేసీఆర్ చావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇంటి దగ్గర చావు డప్పు కొట్టడమేంటి.?. పోలీసులే ఎస్కార్ట్ ఇచ్చి కేసీఆర్ ఇంటి మీదకు ఉసిగొల్పారు. జరిగిన పరిణామాలపై విచారణ జరిపిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు”.. అని కేటీఆర్ అన్నారు.


