ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మోదీకి థింసా నృత్యంతో స్వాగతం పలికారు. స్వర్ణాంధ్రప్రదేశకు ఇదొక శుభదినమని మోదీ ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ ఏపీ అభివృద్ధిలో కీలకమైన రోజు. పవిత్రమైన ఉత్తరాంధ్రకు రావడం నా అదృష్టం. సింహాచలం అప్పన్నకు, పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు. రూ.18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. గిరిజన సంప్రదాయ నృత్యం థింసాను చూసి మధురానుభూతికి లోనయ్యా. గిరిజన మహిళల థింసా నృత్యం ప్రపంచ రికార్డు సాధించింది. 13వేల మంది గిరిజన మహిళల నృత్యం అద్భుతం. థింసా నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఆదివాసీల హక్కుల కోసం అల్లూరి సీతారామరాజు పోరాటం చేశారు. గిరిజనుల కోసం పోరాడిన అల్లూరి పేరు పెట్టుకున్నాం.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వేగా, లాంచ్ ప్యాడ్‌గా ఇది పనిచేస్తోంది. గతంలో ఎక్కడ విమానాశ్రయం నిర్మించినా ఒక కుటుంబ పేర్లే ఉండేవి. సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని చేరువ చేశాం. విశాఖ నుంచి కృష్ణపట్నం పోర్ట్ వరకు అన్నింటిని ఆధునీకరిస్తున్నాం. మూలపేట, రామయ్యపట్నం పోర్ట్‌లను అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో 74కు పైగా రైల్వేస్టేషన్‌లను ఆధునీకరిస్తున్నాం. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగే రాష్ట్రం ఏపీ. భవిష్యత్‌లో ఏపీ ప్రముఖ ఫార్మా హబ్‌గా ఎదగబోతుంది. ఇవాళ ఏపీ ప్రతి రంగంలో అభివృద్ధిలో దూసుకుపోతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల డబుల్ స్పీడ్‌తో ఏపీ అభివృద్ధి. వికసిత్ భారత్‌కు గ్రోత్ ఇంజిన్‌గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. దేశంలో బ్లూ ఎకానమీని అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు.


