లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య మాటల యుద్ధం జరిగింది. శాంతియుత నిరసన చేస్తున్న వారిని పోలీసులు రెచ్చగొట్టేలా ప్రవర్తించారని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు. మూర్ఖులు ఎవరి మాటలు వినరని.. విద్యార్థులు తనతో చెప్పారని అన్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు తమ ఆవేదనను పట్టించుకోవడం లేదని విద్యార్థులు చెప్పారన్నారు. యువత ఆవేదనను పట్టించుకోలేదనే విద్యార్థులు రోడ్లపైకి వచ్చారని చెప్పారు. రోడ్లపైకి వచ్చిన విద్యార్థులపై పోలీసులు హింసించి లాఠీఛార్జ్ చేశారని చెప్పారు.
ఇడియట్స్ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రసంగాన్ని ఎన్డీఏ ఎంపీలు అడ్డుకున్నారు. రికార్డుల నుంచి రాహుల్ వ్యాఖ్యలను తొలగించాలని కిరణ్ రిజిజు కోరారు. విద్యార్థులను అడ్డు పెట్టుకొని రాహుల్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ చెప్పారు.


