మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి పొలిటికల్ జర్నీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. రాజకీయాల్లో అత్యంత సౌమ్యుడిగా పేరున్న ఆయన.. స్థానిక ఎమ్మెల్యేలతో మాత్రం ఎప్పుడూ ఢీ అంటే ఢీ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాజీ మంత్రి పేర్ని నానితో విభేదించిన ఆయన.. నేడు జనసేనలో ఉంటూ ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఇతర ఎమ్మెల్యేలతోనూ అదే తరహా ఆధిపత్య పోరుకు దిగారు. అసలు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలందరికీ ఎంపీ బాలశౌరితోనే ఎందుకు తరచూ విభేదాలు వస్తున్నాయి? నేతల మధ్య రగులుతున్న ఈ వివాదం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది?
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చాలా సౌమ్యుడైన నాయకుడిగా మంచి పేరుంది. వివాదాలకు దూరంగా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ ఆయన క్షేత్రస్థాయి రాజకీయాల ట్రాక్ రికార్డ్ చూస్తే మాత్రం నిత్యం స్థానిక ఎమ్మెల్యేలతో ఏదో ఒక ఆధిపత్య పోరు కనిపిస్తూనే ఉంటుంది. ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా స్థానిక శాసనసభ్యులతో మాత్రం సఖ్యతగా ఉండలేకపోతున్నారు. ఇది ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేల వ్యవహారశైలిలో లోపం ఉందా, లేక ఎంపీ బాలశౌరి రాజకీయ పంథాలోనే లోపం ఉందా అన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో బలంగా జరుగుతున్నాయి. కేవలం ఒకరిద్దరు నాయకులతో కాకుండా, తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మెజారిటీ ఎమ్మెల్యేలతో ఆయన ఎప్పుడూ ఒక ప్రచ్ఛన్న యుద్ధం నడుపుతూనే ఉన్నారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలు మొదలుకుని నామినేటెడ్ పదవుల పంపకాల వరకు ప్రతీ విషయంలోనూ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లుగానే కృష్ణా జిల్లా పాలిటిక్స్ నడుస్తున్నాయి.
గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సమయంలోనూ బాలశౌరి అచ్చం ఇలాంటి రాజకీయ వివాదాలనే ఎదుర్కొన్నారు. అప్పట్లో మచిలీపట్నం ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్న పేర్ని నానితో ఆయనకు తీవ్ర స్థాయిలో విభేదాలు ఏర్పడ్డాయి. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పూర్తిగా పెరిగిపోయి, ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకునే స్థాయికి పరిస్థితులు దిగజారాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ సమీక్షలకు ప్రొటోకాల్ ప్రకారం తనను కనీసం ఆహ్వానించడం లేదని అప్పట్లో బాలశౌరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన నేరుగా మచిలీపట్నం వచ్చి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రయత్నించినప్పుడు, స్థానిక వైసీపీ నేతలు రోడ్డెక్కి ఆయనను అడ్డుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకే పార్టీలో అధికారంలో ఉంటూ మంత్రి, ఎంపీ వర్గాలుగా విడిపోయి వీధిన పడటం అప్పట్లో అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బాలశౌరి వైసీపీని వీడి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మరోసారి మచిలీపట్నం ఎంపీగా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. అయితే పార్టీ మారినా, అధికారంలో ఉన్న ప్రభుత్వం మారినా ఆయనకు ఎమ్మెల్యేలతో వచ్చే వివాదాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మచిలీపట్నం టీడీపీ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్రతో ఆయనకు పొలిటికల్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నంలో ఇటీవల జరిగిన ఒక ఇంటి కూల్చివేత వ్యవహారం ఈ ఇద్దరి మధ్య అగ్గి రాజేసింది. ఈ ఇష్యూలో ఇద్దరు నేతల అనుచరుల మధ్య మరింత రచ్చ రేగింది. నాడు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పేర్ని నానితో పోరాడిన బాలశౌరి, నేడు కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్రతోనూ అదే తీరుతో వ్యవహరిస్తున్నారు. ఇది కేవలం వ్యక్తుల మధ్య వివాదం కాదని, నియోజకవర్గంలో ఆధిపత్యం ఎవరిది అన్న దానిపైనే మంత్రి వర్సెస్ ఎంపీ ఫైట్ నడుస్తోందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆధిపత్య పోరు కేవలం మచిలీపట్నం కేంద్రానికే పరిమితం కాలేదు. తన పార్లమెంటు పరిధిలోని కీలకమైన గన్నవరం నియోజకవర్గంలోనూ ఆయన పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో బాలశౌరికి మొదటి నుంచి సత్సంబంధాలు లేవు. తాజాగా నామినేటెడ్ పదవుల వ్యవహారం ఈ ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ అగాధాన్ని మరింత పెంచింది. గతంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఒక స్థానిక నాయకుడికి, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిర్ పోర్ట్ డెవలప్‌మెంట్ కమిటీలో నామినేటెడ్ పదవి దక్కింది. ఈ అనూహ్య నియామకం వెనుక ఎంపీ బాలశౌరి పూర్తి మద్దతు ఉందన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. తమను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తులకు ఎంపీ నేరుగా పదవులు ఇప్పించడం ద్వారా, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఉనికిని పరోక్షంగా ప్రశ్నిస్తున్నారన్న వాదనలు తెరపైకి వచ్చాయి.
పార్లమెంటు సభ్యుడు, స్థానిక ఎమ్మెల్యేల మధ్య ఏమాత్రం సమన్వయం లేకపోవడం పార్టీ కేడర్‌ను, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర నిధుల మంజూరు విషయంలో కలసికట్టుగా పనిచేయాల్సిన నేతలు ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుండటం కూటమి ప్రభుత్వ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తోంది. ఈ రాజకీయ ఆధిపత్య పోరు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని సీనియర్ నేతలు అధిష్టానానికి నివేదికలు పంపుతున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే పంచాయతీ, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ వివాదాల ప్రభావం నేరుగా పడే అవకాశం స్పష్టంగా ఉంది. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు విడిపోతే అంతిమంగా ప్రతిపక్షాలకు లాభం చేకూరుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంటనే జోక్యం చేసుకుని నేతల మధ్య సమన్వయం కుదర్చకపోతే భవిష్యత్తులో భారీ రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.


