క్యూనెట్ కొత్త రూపం ‘ఇగ్నైట్’ దందాను హైదరాబాద్ సిటీ పోలీసులు ఛేదించారు. కంపెనీ పెట్టిన కేవలం 18 రోజుల్లోనే సీసీఎస్ పోలీసులు ముఠా గుట్టురట్టు చేశారు. దేశవ్యాప్తంగా జరగబోయే భారీ మోసాన్ని మొగ్గలోనే తుంచేశారు పోలీసులు. కేరళ, వెస్ట్ బెంగాల్, యూపీ, ఢిల్లీలలో దాడులు చేసి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
గత 25 ఏళ్లుగా గోల్డ్‌క్వెస్ట్, క్వెస్ట్‌నెట్, క్యూనెట్ పేర్లతో మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠాను పట్టుకున్నారు. మే 18న చండీగఢ్‌లో ‘ఇండీ కనెక్ట్ వెంచర్స్’ పేరిట డమ్మీ సంస్థను రిజిస్టర్ చేశారు నిందితులు. ఎస్సార్ నగర్, కాచిగూడ, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో బాధితుల ఫిర్యాదుతో తొలి కేసులు నమోదు చేశారు. వాట్సాప్, జూమ్ కాల్స్, షాపింగ్ మాల్స్ వేదికగా అమాయకులకు ఎర వేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
600ల రూపాయల ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌ను రూ. 60 వేలకు అమ్ముతూ సభ్యత్వ రుసుములు వసూలు చేశారు. రక్షణ రంగ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలే లక్ష్యంగా ఈ మోసం సాగుతోంది. బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును 7 దశల్లో హవాలా, క్రిప్టో రూపంలో హాంగ్‌కాంగ్‌కు మళ్లిస్తున్నారు. తదుపరి విచారణ కోసం ఈడీ (ED), SFIO సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నారు పోలీసులు. కేవలం కొత్త సభ్యులను చేర్పించి కమీషన్లు ఇచ్చే ఏ వ్యాపారమైనా చట్టప్రకారం నేరమేనని పోలీసులు చెబుతున్నారు.


