హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అల్లంరాజు సత్యనారాయణ మూర్తిని(Allamraju Satyanarayana Murthy) అంతర్జాతీయ సైబర్ మోసాల కేసులో కొచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎర్నాకుళంకు చెందిన ఓ వ్యాపారిని ట్రేడింగ్ పేరుతో రూ.24.76 కోట్లకు మోసం చేసిన కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం, సైప్రస్‌కు చెందిన క్యాపిటల్ ఎక్స్ “Capital X” అనే ట్రేడింగ్ వెబ్‌సైట్ ద్వారా ఈ భారీ మోసం జరిగినట్లు గుర్తించారు. 2023 మార్చి నుంచి ఆగస్టు మధ్య కాలంలో 25 బ్యాంక్ ఖాతాల ద్వారా నిధులను మళ్లించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాధితుడి నుంచి మోసపోయిన మొత్తంలో దాదాపు రూ.16 కోట్లు హైదరాబాద్ మార్గంగా వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసులో బంకా టైసన్ రాజు( Banka Tyson Raju) పేరును కూడా పోలీసులు గుర్తించారు. మరో అనుమానితుడు వరదా రెడ్డి(Varada Reddy) కోసం గాలింపు కొనసాగుతోంది.
మాజీ ఐటీ ఉద్యోగి అయిన మూర్తి ప్రస్తుతం ఐటీ, నిర్మాణ రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సైబర్ నేరాల ద్వారా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ డబ్బును విదేశాలకు మనీలాండరింగ్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దర్యాప్తులో భాగంగా కెన్యాలో మైనింగ్, రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. అలాగే హైదరాబాద్‌లోని సిలికాన్ సిటీ ప్రాంతంలో భారీ ప్రాజెక్టుల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.
క్రిప్టో లావాదేవీలు, విదేశీ రిమిటెన్సులు, బ్యాంకింగ్ రికార్డులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కెన్యా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే మూర్తిని అదుపులోకి తీసుకుని కొచ్చికి తరలించారు.


