హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలి తల్లి విడుదల చేసిన ప్రెస్ నోట్ సంచలనంగా మారింది. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె పలు కీలక ఆరోపణలు చేశారు. తమ కూతురికి న్యాయం చేయాలని కోరుతూ మీడియా, పోలీసులను వేడుకున్నారు.
ప్రెస్ నోట్ ప్రకారం.. 2025లో తమ కూతురికి బండి భగీరథ్ పరిచయం అయ్యాడని, మొదట స్నేహితుడిలా దగ్గరైన అతడు క్రమంగా ఆమెను మానసికంగా ప్రభావితం చేసి చదువుపై దృష్టి తప్పేలా చేశాడని తల్లి ఆరోపించారు.
జనవరి 2026లో ఇద్దరి మధ్య గొడవ జరిగిన సమయంలో, గతంలో భగీరథ్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని తమ కూతురు వెల్లడించిందని తెలిపారు. డిసెంబర్ 31న బలవంతంగా మద్యం తాగించి ఒకసారి, మరోసారి అపార్టుమెంట్‌లో అఘాయిత్యానికి పాల్పడ్డాడని తమ కూతురు చెప్పిందని ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై చట్టపరంగా పోరాడేందుకు సిద్ధమవుతున్న సమయంలో 2026 ఏప్రిల్ 21న తమ కూతురిపై బ్లాక్ మెయిల్ కేసు నమోదైందని తెలిసి తమపై కుట్ర జరుగుతోందని అనుమానం వచ్చిందని చెప్పారు. అనంతరం ఏప్రిల్ 22న సంగప్ప అనే వ్యక్తి ఇంటికి వచ్చి రాజీ ప్రయత్నం చేశాడని, మరుసటి రోజు ఏప్రిల్ 23న అతడి ద్వారా బండి భగీరథ్ తండ్రిని కలిసినట్లు తెలిపారు.
అయితే న్యాయం జరుగుతుందని ఆశించిన తమను అక్కడ అవమానకరంగా మాట్లాడి బెదిరించారని బాధితురాలి తల్లి ఆరోపించారు. దీంతో తమ కూతురి కోసం పోరాడాలని నిర్ణయించుకుని మే 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లామని తెలిపారు.
పోలీసులు మొదట ఫిర్యాదు తీసుకోకుండా గంటల తరబడి వేచిచూసేలా చేశారని, ఎన్నో సార్లు వేడుకున్న తర్వాతే బండి భగీరథ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. ప్రారంభంలో బెయిల్ వచ్చేలా సెక్షన్లు పెట్టినా, తమ కూతురి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తర్వాత సెక్షన్లు మార్చారని ఆరోపించారు.
ఇదే సమయంలో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో తమ కూతురిపై బండి భగీరథ్ కేసు పెట్టాడని తెలిసిందని తెలిపారు. తాము స్టేషన్‌లో ఉన్న సమయంలో సీసీటీవీ ఫుటేజ్, రిజిస్టర్ టైమింగ్స్ భద్రపరచాలని పోలీసులను కోరామని, అలా చేస్తే అసలు ఎవరు ముందుగా ఫిర్యాదు చేశారో స్పష్టమవుతుందని పేర్కొన్నారు.
తమ కూతురి ఫొటోలు, వ్యక్తిగత వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టవద్దని మీడియా, సోషల్ మీడియా యూజర్లను చేతులు జోడించి వేడుకుంటున్నామని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. డేట్ ఆఫ్ బర్త్‌పై వస్తున్న వాదనలు తమ కూతురు అనుభవించిన మానసిక వేదనను తగ్గించలేవని అన్నారు.
పోక్సో కేసులో నమోదైన ఎఫ్ఐఆర్‌పై వేగంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి తమ కూతురికి న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు.


