ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి, కీలకమైన మంత్రి పదవులు అనుభవించిన బడా నాయకులంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కష్టకాలంలో పార్టీని ఆదుకుని, కూటమి ప్రభుత్వంపై పోరాడాల్సిన నేతలు ఎవరికి వారు సైడ్ అయిపోవడం అధినేత వైఎస్ జగన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. కేవలం ఇద్దరు ముగ్గురు నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు మినహా.. మిగిలిన వారంతా ఎందుకు మౌనం వహిస్తున్నారు? పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు కనీసం గళం విప్పకపోవడం వెనుక వాళ్ల భయం ఏంటి?
గత ఐదేళ్ల పాటు ఏపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఇప్పుడు మునుపటి ఉత్సాహం ఏమాత్రం కనిపించడం లేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి పార్టీ శ్రేణులు ఇంకా కోలుకోకముందే.. ముఖ్య నేతల వ్యవహారశైలి క్యాడర్‌ను మానసికంగా మరింత దెబ్బతీస్తోంది. ఐదేళ్ల పాటు ఏపీ క్యాబినెట్‌లో మంత్రులుగా పనిచేసి, అత్యంత కీలకమైన పదవులు అనుభవించిన వారు సైతం ఇప్పుడు కనీసం బయటకు రావడం లేదు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రతిపక్షంగా విమర్శలు చేయాల్సిన కనీస బాధ్యతను పూర్తిగా గాలికొదిలేశారు. నాయకుల ఈ సైలెంట్ వైఖరిపై అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎవరూ ముందుకు రాకపోవడంతో పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలహీనపడే పరిస్థితి ఏర్పడింది. గెలిచినప్పుడు పదవులు అనుభవించి, ఓడిపోగానే మౌనముద్ర దాల్చడం సంస్థాగతంగా పార్టీకి తీరని నష్టం చేకూరుస్తోంది.
ప్రభుత్వ విధానాలను తప్పుబట్టడంలో, కూటమి నేతలను ప్రశ్నించడంలో వైసీపీ ముఖ్య నాయకుల కంటే ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలే ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. జగన్ మీద ఉన్న అభిమానంతో సామాన్య కార్యకర్తలు పడుతున్న కష్టం, పదవులు అనుభవించిన పెద్ద నాయకులు పడటం లేదన్న విమర్శలు సొంత పార్టీ నుంచే గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే నాయకుల ఈ మౌనం వెనుక ఒక అదృశ్య భయం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు గనక బయటకు వచ్చి ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే.. అనవసరంగా అధికార పార్టీ పెద్దల కంట్లో పడతామన్న ఆందోళన బడా నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి నేతలను టార్గెట్ చేస్తే తమ వ్యాపారాలకు, వ్యక్తిగత ఆస్తులకు ఎక్కడ ఇబ్బంది వస్తుందోనన్న భయంతోనే అత్యధిక శాతం మంది నాయకులు తమ ఇళ్లకే పరిమితం అయ్యారని వైసీపీ కేడర్ భావిస్తోంది. పార్టీ అండతో సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికే వాళ్లు ఈ వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించారని క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా సమీక్షించుకున్నా.. కనీసం పది మంది ముఖ్య నాయకులు కూడా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చేయడం లేదు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ఇలా ఏ ప్రాంతంలో చూసినా వైసీపీ పరిస్థితి ఒకేలా ఉంది. కేవలం వేళ్ల మీద లెక్కపెట్టదగిన కొద్దిమంది నాయకులు మాత్రమే రోజూ మీడియా ముందుకు వస్తున్నారు. మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, సీదిరి అప్పలరాజు, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ లాంటి వారు మినహా మరెవరూ పెద్దగా రియాక్ట్ కావడం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేవలం ఈ నలుగురైదుగురు మాత్రమే మొత్తం భారం మోయాలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎటొచ్చీ ఏ కేసులో ఇరుక్కుంటామో అన్న భయంతో మిగిలిన నాయకులంతా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వీళ్లు తప్ప మిగతా వాళ్లు ఎవరూ మైకుల ముందుకు రాకపోవడంతో అధికార పక్షానికి సరైన కౌంటర్ పడటం లేదు.
గత వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ టూ స్థానంలో చలామణి అయిన అగ్ర నాయకుల పరిస్థితి మరీ విచిత్రంగా తయారైంది. పార్టీలో, ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి బడా నేతలే ఇప్పుడు పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. అధినేతకు అత్యంత సన్నిహితులైన వీరే బయటకు రాకపోతుంటే.. ఇక మాకు ఎందుకొచ్చిన గోల అన్న భావన ద్వితీయ శ్రేణి నాయకుల్లో బలంగా నాటుకుపోతోంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కీలక నేతల వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి విడదల రజని.. ఎన్నికల్లో ఓటమి పాలైన కొత్తలో ప్రెస్ మీట్లు పెట్టి కొంత హడావిడి చేసినప్పటికీ, ఆ తర్వాత ఆమె కూడా ఎక్కడా కనిపించకుండా పోయారు. ఏ జిల్లాలో చూసినా కీలక నేతల జాడ లేకపోవడంతో కింది స్థాయి కేడర్ పూర్తిగా డీలా పడిపోయింది. అగ్ర నేతలు ముందుండి నడిపించకపోతే సామాన్య కార్యకర్తలకు మనోధైర్యం ఎలా వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పార్టీ నాయకుల ఈ తీరుపై వైసీపీ సోషల్ మీడియా వేదికగానే తీవ్ర స్థాయి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన నాయకులు, ఇప్పుడు కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడకపోవడం దారుణమని కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇలాంటి స్వార్థపూరిత నాయకులను నమ్మి జగన్ వారికి టికెట్లు ఇవ్వడంతో పాటు, కీలకమైన మంత్రి పదవులు ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశారన్న కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. కేవలం పదవుల కోసమే పార్టీలో ఉన్నారా, ఇబ్బందులు రాగానే ముఖం చాటేస్తారా అని సామాన్య కార్యకర్తలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అధినేత జగన్ ఇప్పటికైనా ఈ సైలెంట్ నేతల వ్యవహారంపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇలాంటి వారిని పక్కనపెట్టి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించకపోతే రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగతంగా మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం స్పష్టం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.


