పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: రూ.3 పెంచిన ఆయిల్ కంపెనీలు

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై సగటున రూ.3, డీజిల్‌పై రూ.3 పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి.

ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.97.77కు, డీజిల్ ధర రూ.90.67కు చేరింది. ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో కూడా ఇదే తరహా పెంపు అమలులోకి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై రూ3.29, డీజిల్‌పై రూ.3.14, తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3 చొప్పున ఆయిల్‌ కంపెనీలు పెంచాయి.

సీఎన్ జీ ధర పెంపు

ఇక సిఎన్‌జీ (CNG) ధరలకూ భారీ పెరుగుదల చోటుచేసుకుంది. ఢిల్లీలో కిలో సిఎన్‌జీ ధర రూ.2 పెరిగి రూ.77.09 నుంచి రూ.79.09కు చేరింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) లో కూడా కిలోకు రూ.2 పెంచడంతో ప్రస్తుతం అక్కడ సిఎన్‌జీ ధర రూ.84గా ఉంది. ఈ పెంపుతో క్యాబ్‌లు, ఆటోలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

పెరుగుతున్న OMCల నష్టాలు

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వెనుక ప్రధాన కారణం ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై (OMCs) పెరుగుతున్న ఆర్థిక భారం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి సంస్థలు గత కొంతకాలంగా భారీ నష్టాలను భరిస్తున్నాయి.

మార్చిలో ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచినప్పటికీ సాధారణ రిటైల్ ధరలను మాత్రం ప్రభుత్వం స్థిరంగా ఉంచింది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ఆయిల్ కంపెనీలు రోజుకు సుమారు రూ.1,600 కోట్ల వరకు నష్టపోతున్నట్లు సమాచారం. అధిక ధరలకు ముడి చమురును కొనుగోలు చేస్తున్నా, అదే స్థాయిలో వినియోగదారులపై భారం మోపకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

ఇరాన్ యుద్ధం ప్రభావం

ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో ప్రారంభమైన ఇరాన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో తీవ్ర అస్థిరత నెలకొంది. యుద్ధానికి ముందు భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ బాస్కెట్ ధర బ్యారెల్‌కు సగటున 69 డాలర్లుగా ఉండేది. కానీ యుద్ధ ప్రభావంతో అది 113-114 డాలర్ల వరకు పెరిగింది. అంటే కొన్ని వారాల్లోనే 50 శాతం కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది.

ఈ పరిస్థితుల్లో ఆయిల్ కంపెనీలు మొదట నష్టాలను తట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, తర్వాత పరిస్థితి అదుపు తప్పింది. దీంతో ధరల పెంపు తప్పదని కేంద్రానికి నివేదికలు పంపినట్లు సమాచారం.

ఆర్థిక నిపుణుల సూచనలు

ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా సహా పలువురు ప్రముఖ ఆర్థికవేత్తలు ఇంధన ధరలను మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెంచాల్సిందేనని సూచించారు. లేదంటే ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ద్రవ్యోల్బణం భయంతో ఆలస్యం

ఇంధన ధరలు పెరిగితే దాని ప్రభావం రవాణా, సరుకు రవాణా, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుంది. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ కారణంగానే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ధరల పెంపును వాయిదా వేసిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ పిలుపు

ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రజలకు ఇంధనాన్ని పొదుపుగా వినియోగించాలని పిలుపునిచ్చారు. సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ పాటించాలని సూచించారు. దీని వల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రచారం

ప్రధాని పిలుపుకు మద్దతుగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా 90 రోజుల ప్రత్యేక ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రకటించారు. ప్రజలు ఇంధన వినియోగాన్ని తగ్గించే జీవనశైలిని అలవరుచుకోవాలని ఆమె సూచించారు. అదనంగా ప్రభుత్వ కార్యాలయాలకు వారంలో రెండు రోజుల వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.

దేశంలో ఇంధన నిల్వలు సరిపోతాయా?

ప్రస్తుతం దేశంలో సుమారు 60 రోజులపాటు సరిపడే ఇంధన నిల్వలు, అలాగే 45 రోజుల LPG నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగుతున్నప్పటికీ దేశంలో ఇంధన కొరత లేదని కేంద్రం పునరుద్ఘాటించింది.

ప్రజలపై ప్రభావం ఎలా?

ఈ ధరల పెంపుతో వ్యక్తిగత వాహనదారులు మాత్రమే కాకుండా రవాణా రంగం, సరుకు రవాణా సంస్థలు, వ్యవసాయ రంగం కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో బస్సు ఛార్జీలు, టాక్సీ ఛార్జీలు, కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్