పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee) గురువారం కోల్‌కతా హైకోర్టు( Calcutta High Court)లో హాజరై ఎన్నికల అనంతర హింసకు సంబంధించిన కేసులో వాదనలు వినిపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ పార్టీ కార్యాలయాలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ఆమె కోర్టును ఆశ్రయించారు.
విచారణ ముగిసిన అనంతరం కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు “చోర్.. చోర్” అంటూ నినాదాలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన మమతా బెనర్జీ.. “నాపై దాడి చేశారు” అంటూ మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ ఘటనను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. పార్టీ నేత, న్యాయవాది కళ్యాణ్ బెనర్జీ( Kalyan Banerjee) మాట్లాడుతూ.. బీజేపీ ప్రభావంలో ఉన్న కొందరు న్యాయవాదులు మమతా బెనర్జీని అవమానించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కోర్టు ప్రాంగణంలో ఇలా నినాదాలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.
విచారణ సందర్భంగా మమతా బెనర్జీ కోర్టుకు కీలక వివరాలు సమర్పించారు. ఎన్నికల అనంతర హింసలో 10 మంది మరణించారని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. బాధితుల ఫిర్యాదులను పోలీసులు వెంటనే స్వీకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
“ప్రజల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు. పోలీసుల ఎదుటే దాడులు జరుగుతున్నాయి. ఇది బుల్డోజర్ పాలన కాదు” అంటూ మమతా బెనర్జీ కోర్టులో వ్యాఖ్యానించారు. తృణమూల్ కార్యకర్తలు ఇళ్లను వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా ఆమె ఆరోపించారు.
ఈ పిటిషన్‌ను తృణమూల్ తరఫున న్యాయవాది శీర్షణ్య బంద్యోపాధ్యాయ దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత తమ పార్టీ కార్యకర్తలపై లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆయన కోర్టుకు వివరించారు.
కోర్టుకు హాజరైన సందర్భంగా మమతా బెనర్జీ న్యాయవాది దుస్తుల్లో కనిపించారు. తెలుపు రంగు చీరపై నల్ల కోట్, వైట్ కాలర్ బ్యాండ్ ధరించి ఆమె కోర్టుకు రావడం చర్చనీయాంశమైంది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “బెంగాల్ ప్రజల కోసం మమతా బెనర్జీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటారు” అంటూ ఆమెకు మద్దతు తెలిపింది.


