ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్ కంపెనీలు ఉద్యోగ కోతల బాట పడుతున్నాయి. ఖర్చుల నియంత్రణతో పాటు భవిష్యత్ వ్యూహాల దృష్ట్యా సంస్థాగత మార్పులు చేపడుతున్నాయి.
ప్రముఖ నెట్‌వర్కింగ్ సంస్థ సిస్కో( Cisco) మరో విడత ఉద్యోగాల కోతలను ప్రకటించింది. ప్రస్తుత త్రైమాసికంలో సుమారు 4 వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం కంటే తక్కువేనని కంపెనీ తెలిపింది.
సంస్థ దీర్ఘకాలిక వృద్ధికి ఉపయోగపడే రంగాలపై పెట్టుబడులను కేంద్రీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిస్కో సీఈవో చక్ రాబిన్స్ పేర్కొన్నారు. మరోవైపు కంపెనీ మూడో త్రైమాసికంలో 15.8 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసి 12 శాతం వృద్ధిని సాధించినట్లు వెల్లడించింది.
ఇక లింక్డిన్( LinkedIn) కూడా భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమవుతోంది. మైక్రోసాఫ్ట్( Microsoft) ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థలో దాదాపు 875 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఇది మొత్తం ఉద్యోగుల్లో సుమారు 5 శాతం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సంస్థాగత మార్పులు చేపట్టినట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
మరోవైపు అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్( Walmart) కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించే నిర్ణయం తీసుకుంది. దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించడం లేదా ఇతర విభాగాలకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్ బృందాలను విలీనం చేయనున్నట్లు తెలిపింది.
టెక్ రంగంలో కొనసాగుతున్న మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, వ్యయ నియంత్రణ చర్యలు… ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ విపణిపై ప్రభావం చూపుతున్నాయి.


