ప్రకృతి ప్రపంచంలో అనేక రకాల జీవరాశులు ఉన్నాయి… అందులో కొన్నింటిని చూస్తే ఇవి ఇంత అద్భుతంగా ఎలా మారాయి?… అనే సందేహాలు కలగక మానవు. అలాంటి జీవుల్లో ముఖ్యమైనవి… పాములు.
పాములు లేదా సర్పాలు… పొడవుగా, పొలుసులు కలిగి, కాళ్లులేని, భూచరాలైన సరీసృపాలు. ఇంతవరకు పాములలో 2,900 జాతులను గుర్తించారు. పాములు కేవలం సరీసృపాలు కావు. అవి ప్రకృతి రూపొందించిన అల్టిమేట్ సర్వైవల్ మెషీన్స్… అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా… దానికి అనుగుణంగా మారిపోయే జీవులని అర్ధం. అందుకే పాములు ప్రపంచంలో దాదాపు ప్రతి చోట కనిపిస్తాయి —ఎడారులు, దట్టమైన అడవులు, సముద్రాలు…కొన్నిసార్లు మనుషుల వాహనాల్లో కూడా!
సృష్టి ఆరంభం నుంచి ఈ క్రూరమైన ప్రపంచం విసిరిన అనేక సవాళ్లను పాములు ఎలా అలవాటు చేసుకోగలిగాయి.. కోట్ల సంవత్సరాల క్రితం…ఒక చిన్న, ప్రాచీన పూర్వీకుడు నేలపై పాకుతూ ఉండేవాడు. కాలం గడిచేకొద్దీ అది పూర్తిగా మారిపోయింది. మిలియన్ల సంవత్సరాల తర్వాత… మనకు ఇప్పుడు రెండు విభిన్న రూపాలు కనిపిస్తున్నాయి.. నేలలో దాక్కునే చిన్న పాములు. బస్సు సైజులో ఉండే మహాకాయ పాములు లాంటి Titanoboa వంటి పాములు. అసలు పాములు ఇలా ఎలా పరిణామం చెందాయి ?
పాములు వర్సెస్ బల్లులు… ఏది త్వరగా పరిణామం చెందింది?
ఇది తెలుసుకునేందుకు .. పాములు, బల్లులు వంటి 11,000 సరీసృప జాతులపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ రెండు సమూహాలు వేర్వేరు అయినప్పటికీ.. పాములు మాత్రం బల్లుల కంటే చాలా వేగంగా రూపాంతరం చెందుతున్నట్లు గుర్తించారు. ఇవాళ సుమారు 4,000 పాము జాతులు ఉన్నాయి. ఇవి భూమిలో బొరియలు తవ్వుకునే అతి చిన్న దారపు పాముల నుండి భారీ ఆకుపచ్చ అనకొండల వరకు పరిమాణంలో విభిన్నంగా ఉంటాయి. ఇంకా ఇవి కేవలం ఆధునిక జాతులు మాత్రమే. బస్సు అంత పెద్దగా ఉండే టైటానోబోవా , వాసుకి ఇండికస్ వంటి భారీ సర్పాల గురించి మనం మర్చిపోకూడదు.
ఇక ఇదే విషయంపై లోతుగా అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు. పాములు ఎందుకు ఇంత వేగంగా పరిణామం చెందుతున్నాయో తెలుసుకోవడానికి, పరిశోధకులు దాదాపు 1,000 పాములు , బల్లుల జన్యువులను విశ్లేషించారు. ఆహారపు అలవాట్లలో మార్పులను గమనించడానికి, వారు 60,000కు పైగా మ్యూజియం నమూనాలు ,క్షేత్ర నివేదికలలోని జీర్ణాశయాలను కూడా అధ్యయనం చేశారు. ఒక నిర్దిష్ట సమయంలో పాముల శరీరంలో మార్పులు, ఆహారపు అలవాట్లు ఎలా మారాయో తెలుసుకోవడానికి ఒక “ఎవల్యూషనరీ ఫ్యామిలీ ట్రీ” ని తయారు చేశారు.
ఈ అధ్యయనం ఫలితం చాలా ఆశ్చర్యకరంగా వచ్చింది. పాములు… బల్లుల కంటే మూడు రెట్లు వేగంగా పరిణామం చెందుతున్నాయి! వాటి పరిణామ ప్రయాణం సుమారు 128 మిలియన్ సంవత్సరాల క్రితం మొదలైంది. కానీ అసలు వేగం వచ్చింది క్రిటేషియస్ కాలంలో — అంటే 128 నుంచి 70 మిలియన్ సంవత్సరాల మధ్య మార్పులు వేగంగా జరిగాయి. ఆ కాలంలో భూమిపై జీవులు చాలా పెద్దగా ఉండేవి. అది డైనోసార్ల యుగం.
66 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతరించిపోయాక, మరో పరిణామ విప్లవం జరిగింది. కొత్త జంతువులు, కొత్త వాతావరణం… కొత్త అవకాశాలు. అప్పుడు పాములు వేగంగా మారిపోయాయి. కొత్త వేట పద్ధతులు నేర్చుకున్నాయి. కొత్త శరీర ఆకృతులు అభివృద్ధి చేసుకున్నాయి.
ఆ వేగవంతమైన పరిణామం ఇప్పటికీ ఆగలేదు. అంటే పాములు ఇప్పటికీ మారుతూనే ఉన్నాయి. కొత్త వాతావరణాలకు, కొత్త ఆహారానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. అంటే వాటి ప్రస్థానం ముగియడానికి ఇంకా చాలా సమయం ఉంది.


