ఏపీలో ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ పంపిణీ ప్రారంభంకావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ సందడి నెలకొంది. ప్రతి నెలా 1వ తేదీనే పెన్షన్ పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. పెంచిన పెన్షన్‌తో లబ్దిదారులకు ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నారు అధికారులు.
పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో పలుచోట్ల.. మంత్రులు, ఎమ్మెల్యేలు పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. స్వయంగా తామే లబ్దిదారులకు పెన్షన్‌ను అందజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 64.82 లక్షల మంది లబ్దిదారుల కోసం ముందుగానే ప్రభుత్వం 2లక్షల 737.41 కోట్లు విడుదల చేసింది. పెన్షన్ పంపిణీ నేపథ్యంలో ఇవాళ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి 96 శాతం, రేపు వంద శాతం పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. లబ్దిదారుల వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. వారితో మాట్లాడి వారి స్పందన తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.


