వైసీపీ పాలనలో జరిగిన హింసా రాజకీయాలు, అధికార దుర్వినియోగం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రిరిజంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత 5 ఏళ్ల అరాచకాలు, అక్రమాలు, దాడులు, తప్పుడు కేసులపై వివరాలను ప్రభుత్వ పెద్దలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. బాధితులనే నిందితులను చేస్తూ పెట్టిన తప్పుడు కేసులు, కారకులపై నివేదికలను ప్రభుత్వంసిద్ధం చేస్తున్నట్టు సమాచారం. నిబంధనలు మీరిన అధికారులపై నిబంధనల ప్రకారమే చర్యలకు కసరత్తు నిర్వహిస్తోంది. పోలీసు శాఖ సహా అన్ని శాఖల్లో జరిగిన నాటి అధికార దుర్వినియోగంపై డాటా సేకరణ చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై అణిచివేత, హింసకు పాల్పడిన ఘటనలపై ఆరా తీస్తున్నారు.
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్, కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం, నంద్యాల అబ్దుల్ సలాం, బాపట్ల అమర్నాథ్ గౌడ్, పలమ నేరు మిస్బా, కావలి కరుణాకర్ వంటి ఘటనలపై నివేదికలను ప్రభుత్వం తెప్పించుకుంటోంది. టీడీపీ రాష్ట్ర కార్యాల యంపై దాడి, నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంపై దాడి, నాయకులు, కార్యకర్తలు, వారి ఇళ్లపై జరిగిన దాడులు, వాటి వెనుక ఉన్న శక్తులపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. గత 5 ఏళ్లలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్తలు, ఆయా ఘటనలపై నమోదైన కేసుల పురోగతిపై ప్రభుత్వ పెద్దలు నివేదికలు తెప్పించుకున్నట్టు తెలు స్తోంది. ఆయా ఘటనలపై నమోదైన కేసులు, వాటి ప్రస్తుత స్టేటస్ పైనా నివేదికలు కోరినట్టు తెలుస్తోంది. అధికార అండతో ప్రైవేటు ఆస్తులు, గనులు, వ్యాపారాలు స్వాధీనం చేసుకున్న వారి జాబితాను ఆయా శాఖలు సిద్ధం చేస్తున్నా యి. రాష్ట్ర స్థాయిలో జరిగిన ప్రభుత్వ దోపిడీ, ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ఎమ్మెల్యేల, ఎంపీల అక్రమాలపై విడివిడిగా ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఇప్పటికే బయటకు వచ్చి నాటి ప్రభుత్వ అక్రమాలపై పలు చోట్ల సామాన్య ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక్కొక్కటిగా అక్రమాలను ప్రజల ముందు పెట్టి, చట్టబద్దంగానే చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.


