ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి సాయం అందించేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశంలో మంత్రులకు శాఖలను కేటాయించారు. మంత్రివర్గంలో పనిచేసిన సీనియర్స్‌కి యధాతథంగా అవే శాఖలు కేటాయిం చారు. అమిత్ షాకు హోం శాఖ, రాజ్‌నాథ్ సింగ్‌కు రక్షణ శాఖ, జై శంకర్ కు విదేశాంగ శాఖ, గడ్కరీకి రోడ్డు రవాణా శాఖ, నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖ, అశ్విని వైష్ణవ్‌కు రైల్వే, సమాచార ప్రసార శాఖ, జేపీ నడ్డాకు వైద్య శాఖ కేటాయించారు.
ధర్మేంద్ర ప్రధాన్‌కు విద్యా శాఖ, పీయూష్ గోయల్‌కు వాణిజ్య శాఖ, శ్రీపాదనాయక్‌కు విద్యుత్ శాఖ, కిరణ్ రిజిజుకు పార్లమెంట్ వ్యవహారాలు, షెకావత్‌కు సాంస్కృతిక శాఖ జితిన్ రామ్ మాంఝీకి చిన్న, మద్యతరగతి పరిశ్రమలు కేటాయించారు. హెచ్‌డీ కుమారస్వామికి ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్ కి వ్యవసాయం, గ్రామీణం, పంచాయితీరాజ్ శాఖ, చిరాజ్ పాశ్వాన్ కి క్రీడాశాఖ కేటాయించారు. మోడీ 3.0 ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు లభించింది. వరుసగా రెండోసారి కిషన్‌రెడ్డికి అవకాశం దక్కగా తొలిసారి బండి సంజయ్‌కు కూడా కేబినెట్‌లో అవకాశం దక్కింది. ఇక పొత్తులో భాగంగా తెలుగు దేశానికి చెందిన ఇద్దరి ఎంపీలకు మోడీ కేబినెట్ లో చోటు లభించింది. రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ దక్కగా కిషన్‌రెడ్డికి బొగ్గు, గనులు శాఖ; బండి సంజయ్‌కి హోంశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణ, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి; శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి పదవి దక్కాయి. బీజేపీ నుంచి ముగ్గురికి, టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది.


