ఎన్డీయే కూటమిలో తెలుగుదేశంతో పాటు కీలక భాగస్వామ్యపక్షంగా మారిన జనతాదళ్ యునైటెడ్ జేడీయూ పార్టీ కూడా ఈసారి కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వం ముందు కీలక డిమాండ్లు ఉంచుతోంది. బీహార్‌లో మొత్తం లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. రాష్ట్రీయ జనతాదళ్ – కాంగ్రెస్ నాయకత్వలోని మహాఘట్‌బంధన్ పోటీని తట్టుకుంటూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీ యూ 12 సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్ర ప్రయోజనా లు కాపాడటానికి జేడీ యూ చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. తాజాగా బీహార్‌కు ప్రత్యేక హోదా అంశం తెరమీద కు వచ్చింది. బీహార్‌కు ప్రత్యేక హోదా అంశం ఇప్పటిది కాదు. చాలా కాలం నుంచి ఉన్నదే. అయితే ఇప్పటివరకు ప్రత్యేక హోదా అంశంపై బీహార్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లభించలేదు. తాజాగా జేడీయూ సీనియర్ నేత, బీహార్ మంత్రి విజయ్‌కుమార్ చౌధురి పాట్నాలో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. బీహార్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, సాధ్యమైనంత త్వరగా ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీహార్ ముఖ్యమంత్రి, జేడీ యూ అధినేత నితీశ్ కుమార్ కొంతకాలంగా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తు న్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌పై కిందటేడాది ఆయన నాయకత్వంలోని రాష్ట్ర క్యాబినెట్ ప్రత్యేక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అయితే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి కిందటేడాది నవంబరు లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు నితీశ్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. బీహార్‌కు అతి త్వరలోనే ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నితీశ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రానికి వ్యతిరేకంగా బీహార్ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని అప్పట్లోనే నితీశ్ కుమార్ ప్రకటించారు.
ప్రత్యేక హోదా డిమాండ్‌కు మద్దతు ఇవ్వని వారిని బీహార్ అభివృద్దిని అడ్డుకున్నవారిగా తాము పరిగణిస్తామని ముఖ్య మంత్రి నితీశ్ కుమార్ పేర్కొన్నారు. కాగా అంతకుముందే కులాల ఆధారంగా రిజర్వేషన్ల పెంపు బిల్లును బీహార్ అసెంబ్లీ ఆమోదించింది. ఈ విషయాన్ని కూడా నితీశ్ కుమార్ ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీలకు ఉన్న రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి తమ ప్రభుత్వం పెంచిన విషయాన్ని నితీశ్ కుమార్ ప్రస్తావించారు. బీహార్‌కు ప్రత్యేక హోదా అంశంపై జేడీ యూ అధినేత నితీశ్ కుమార్ చాలా క్లారిటీతో ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. దీనికోసం బీహార్ వంటి పేద రాష్ట్రానికి అనేక కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. అయితే బీహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తే, వచ్చే రెండున్నరేళ్లలోనే ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించ గలుగుతామన్నారు. ఈ నేపథ్యంలో బీహార్‌కు తక్షణమే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
బీహార్‌కు ప్రత్యేక హోదాతో పాటు దేశవ్యాప్తంగా కులగణన జరపాలని కూడా నితీశ్ కుమార్ కోరే అవకాశాలు కనపడుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పుణ్యమా అంటూ కిందటేడాది దేశవ్యాప్తంగా కులగణన హల్‌చల్ చేసింది. కులగణన విషయమై కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేతులెత్తేసిన సమయంలో కులాలవారీగా లెక్కలు తీసి అందరితో శెహభాష్ అనిపించుకున్నారు నితీశ్ కుమార్.దాదాపు నాలుగేళ్ల నుంచి దేశ రాజకీయాల్లో కులగణన అంశం అప్పుడప్పుడూ ప్రస్తావనకు వస్తోంది. యూపీఏ రెండో టర్మ్‌లో కూడా కులగణన డిమాండ్ ప్రస్తావనకు వచ్చింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఈ డిమాండ్‌ను బలపరచింది. ఈ పరిస్థితుల్లో 2014లో కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చింది. అధికారానికి వచ్చిన తరువాత కులగణనకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపలేదు. పార్లమెంటు సాక్షిగా అప్పటి కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ కులగణనకు నో చెప్పారు. ‘విధాన పరంగా ఎస్సీ, ఎస్టీలు మినహా కుల ఆధారిత జనాభా లెక్కలు ఇప్పటి కైతే సేకరించరాదని కేంద్రం నిర్ణయం తీసుకొన్నద’ని ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇలా వ్యూహాత్మకంగా జనాభాలో బీసీల లెక్కలు తీయకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్పించుకుంది. ఈ పరిస్థితుల్లో కిందటేడాది బీహార్‌లో కులగణన జరిపి దేశ ప్రజల జేజేలు అందుకు న్నారు నితీశ్ కుమార్. మొత్తం రెండు దశల్లో కులగణన ప్రక్రియను నితీశ్ కుమార్ పూర్తి చేశారు. యావత్ భారతదేశానికి బీహార్‌ను ఒక రోల్ మోడల్‌గా బీహార్‌ను ఆయన తీర్చిదిద్దారు.
కులగణనతో బీసీలకు పెద్ద ఎత్తున ప్రయోజనాలున్నాయి. దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న వెనుకబడిన తరగతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు జరగాలన్నా కులాలవారీగా జనాభాను లెక్కించి తీరాల్సిందే. బీసీల నాయక త్వంలో నడిచే ప్రధాన రాజకీయ పార్టీలు చాలా కాలంగా ఈ డిమాండ్ చేస్తున్నాయి. కులాలవారీగా లెక్కలు లేనట్లయితే తమ మేలు కోసం తీసుకువచ్చే చట్టాల అమలులో తీవ్ర ఇబ్బందులు ఉంటాయంటున్నారు బీసీ వర్గాల నేతలు. దేశ జనాభాలో కులపరంగా, ఆర్థికంగా, చదువుపరంగా వెనుకబడిన కులాలు అంటే ఓబీసీలు 52 శాతం ఉంటారన్నది ఒక అంచనా. వీరికి కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ గతంలోనే సిఫార్సు చేసింది. 1931లో చివరిసారిగా జరిగిన కులగణన వివరాలను ఓబీసీల గుర్తింపునకు ప్రాతిపదికగా తీసుకుంది. అప్పటి నుంచి దేశంలో వివిధ వెనుకబడిన తరగతులు ఎంత శాతం ఉన్నాయనే విషయాన్ని కచ్చితంగా లెక్కగట్టాలనే డిమాండ్ బలంపుంజుకొంది. అయినా 2001,2011 సెన్సస్‌లో కులాల వారీగా లెక్కలు తీయడానికి కేంద్రం అంగీకరించలేదు.
కులాలవారీ జనాభా లెక్కలపై స్పష్టత లేకపోవడంతో వెనుకబడిన తరగతులు బాగా నష్టపోతు న్నాయన్నది వాస్తవం. బీసీ జనాభాకు చెందిన లెక్కల వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణ యించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ లెక్కలు స్పష్టంగా లేకపోవడం వల్లనే సుప్రీంకోర్టు, హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని కొట్టి వేస్తున్నాయి. జనాభా లెక్కలు సమగ్రంగా లేకపోవడంతో రిజర్వేషన్లను ఏ మేరకు నిర్ణయించాలనే అంశంపై బీసీ కమిషన్లు ఇబ్బం దులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వెనుకబడిన తరగతులకు ప్రయోజనాలు కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. జనాభా గణనలో కులాలవారీగా లెక్కలు తీయాలి. 2012 లో పేదరికం సర్వే కోసం కులాలవారీ లెక్కలను కేంద్రం సేకరించింది. అయితే ఈ వివరాలను ఇప్పటి వరకు బయటపెట్టలేదు. 1931 తర్వాత ఎస్సీ, ఎస్టీ మినహా కులాలవారీగా జనగణన చేపట్టనే లేదు. ఏదిఏమైనా వెనుకబడిన తరగతుల జనాభాపై ఇప్పటివరకు అంచనాలే తప్ప ఒక స్పష్టత అంటూ లేదు. దీంతో మొత్తం జనాభాలో ఓబీసీల శాతం ఎంత అనేది ఒక అంచనాగానే మిగిలిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఓబీసీలకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కులగణన జరిగితేనే ఓబీసీలకు సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.


