రాజకీయానికి కాదేది అనర్హం అన్నట్టు తయారయ్యాయి పాలిటిక్స్. తాము గెలిచేందుకు తమ పాచిక పారేందుకు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ పావులు కదిపే కమలనాథులు యావత్ దేశంలో కాషాయ జెండానే ఎగురాలన్న తపనలో ఉన్నారు. ఈ మేరకు హిందూ నినాదంతో ఇతర మతాలను టార్గెట్ చేస్తూ సినిమా లను అస్త్రంగా మార్చుకుంది బీజేపీ. గడిచిన రెండేళ్లలో మత విద్వేషాన్ని రగిల్చే వివాదస్పద చిత్రాలు పదుల సంఖ్యలో రిలీజ్ అయ్యాయంటే సినిమా మాద్యమంపై ఏ మేర ఫోకస్ పెట్టిందో ఇట్టే అర్థమై పోతుంది. మరి ఆ చిత్రాలేంటో ఓ సారి చూసేద్దామా.
గత కొన్ని సంవత్సరాలుగా హిందుత్వ పార్టీల సిద్ధాంతాలే కేంద్రంగా వస్తున్న సినిమాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముస్లింలు, ఆదివాసీలు, ప్రగతీశీల శక్తులను టార్గెట్ చేస్తూ ఈ సినిమాలు రూపొందుతుండడం గమనార్హం. కుక్కపిల్లా, సబ్బుబిళ్ళా, అగ్గిపుల్లా కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. ఇప్పుడీ నినాదం రాజకీయాలకు వందశాతం అప్లై అయ్యే నానుడిగా మారింది. ఓటర్లను ఆకట్టుకునేం దుకు రాజకీయ పార్టీలు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవు అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికలను గమనిస్తే మరో వర్గంపై ద్వేషాన్ని పెంచడంపై రాజకీయ శక్తులు ఫోకస్ పెంచాయని అర్థమవుతుంది. అందుకు సినిమాను మాద్యమంగా వాడుకోవడం గమనార్హం. గడిచిన రెండేళ్లలో పదుల సంఖ్యలో వివాదస్పద చిత్రాలు వెలువడ్డాయి. ఈ సినమాలన్నీ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేశాయనే విమర్శలు ఉన్నాయి.
2019 పార్లమెంటు ఎన్నికలకు ముందుగా ఇలాంటి సినిమాలు రెండు విడుదలయ్యాయి. అప్పట్లో వీటిపై చాలా చర్చ జరిగింది. వాటిలో ఎన్నికలకు మూడు నెలల ముందు విజయ్ గుట్టె దర్శకత్వంలో వచ్చిన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మొదటిది. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మీడియా అడ్వైజర్ సంజయ్ భారూ రాసిన పుస్తకం ఆధారంగా ఆ సినిమా తెరకెక్కింది. అందులో మన్మోహన్ సింగ్‌పై కాంగ్రెస్ అధినాయకత్వం ఆధిపత్యం చెలాయించినట్లుగా చూపించారు. అయితే,.. ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాస్పదమైంది. కాంగ్రెస్ బీజేపీల మధ్య ఓ రేంజ్‌లో డైలాగ్ వార్ నడిచింది. 10 ఏళ్ల పాటు దేశం ఒక కుటుంబం గుప్పిట్లో ఎలా ఉంచుకుంది. ప్రధాని పదవికి ఆ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని సిద్ధ పరిచేవరకు మన్మోహన్ సింగ్‌ను పావులా వాడుకున్నారా.? అధికారిక ట్రైలర్ విడుదలైంది. చూడండి అంటూ బీజేపీ ట్వీట్ చేయడంతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. వాస్తవాలను వక్రీకరించారని ఆరోపించాయి. బాలీవుడ్ సినిమాలు ట్వీట్ చేయడమే బీజేపీ పనిగా పెట్టు కుందా అంటూ కొందరు నెటిజన్లు మండిపడగా ఇక నుంచి వచ్చే ఇతర చిత్రాలకు సంబంధించిన ట్రైలర్లను కూడా బీజేపీ రివ్యూతో పోస్టు చేస్తే బాగుంటుందని మరికొందరు విమర్శించారు. ఇక ఈ మూవీ తర్వాత ఎన్నికలకు సమీపంలో ద తాష్కెంట్ ఫైల్స్- హు కిల్డ్ శాస్త్రి సినిమా విడుదలైంది. అందులో మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై ప్రశ్నలు సంధించారు. అయితే, అది సమీక్షకుల మన్ననలు పొందలేకపోయింది. ఆ రెండు సినిమాలనూ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీశారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అయితే, ఈసారి మళ్లీ లోక్‌సభ ఎన్నికలు నేపథ్యంలో పదుల సంఖ్య లో వివాదస్పద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
గత ఏడాది ఏకంగా ఇలాంటి సినిమాలు మూడు విడుదలయ్యాయి. వీటిలో మొదటిది ద కేరళ స్టోరీ. దీనిలో నర్సు కావాలనుకునే ఓ యువతికి మతమార్పిడి చేసి ఐఎస్ఐఎస్‌లో చేర్పిస్తారు. చివరగా ఆమె అఫ్గానిస్తాన్ జైలులో చిక్కుకుంటారు. ఈ సినిమాపై చాలా వ్యతిరేకత వ్యక్తమైంది. సుదీప్తో సేన్ దర్శక త్వం వహించిన ఈ సినిమా 2023 మే నెలలో విడుదలైంది. దీనికి భారతీయ జనతా పార్టీ గట్టి మద్దతు ప్రకటించింది.ఇక ఆ చిత్రం తర్వాత మరో మూవీ విడుదలైంది. అదే ద కశ్మీర్ ఫైల్స్. 1990లలో కశ్మీర్ నుంచి కశ్మీరీ పండిట్లను వెళ్లగొట్టినప్పటి పరిణామాల ఆధారంగా తీసిన ఈ సినిమాను వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. ఈ చిత్రానికి కూడా బీజేపీ గట్టి మద్దతు ప్రకటించింది. ఈ సినిమా ఆనాటి వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టిందని కమలనాథులు తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రా ల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపులు కూడా ఇచ్చింది.
ఇక మూడో సినిమా ద వ్యాక్సీన్ వార్. ఈ సినిమాకు కూడా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. కోవిడ్-19 మహమ్మారి చెలరేగుతున్న సమయంలో భారత్‌లో వ్యాక్సీన్ తయారీ ప్రక్రియల వెనుక పరిణామాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే, ఈ సినిమా కేంద్ర ప్రభుత్వ ప్రచార చిత్రంలా ఉందని సమీక్షకులు విమర్శలు చేశారు. మొత్తానికి గత ఏడాది అక్టోబరు 23న ఈ సినిమా విడుదలైంది.
అయితే, ఈ మూడు సినిమాల్లో ద కేరళ స్టోరీ, ద కశ్మీర్ ఫైల్స్‌పై దేశ వ్యాప్తంగా చాలా చర్చ జరిగింది. ముఖ్యంగా ద కేరళ స్టోరీలో ఆ రాష్ట్రాన్ని నెగటివ్‌గా చూపించారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై చాలా కేసులు కూడా నమోదయ్యాయి. ఈ తరహా సినిమాలు ఒకవైపు వస్తుంటే.. ఏప్రిల్ 5న వివాదాస్పద చిత్రమైన ద కేరళ స్టోరీ సినిమాను భారత ప్రభుత్వ టీవీ చానెల్ దూరదర్శన్‌లో ప్రసారం చేశారు. దీనిపై ప్రకటన వెలువడినప్పుడే, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యతిరేకించారు. జాతీయ టీవీ చానెల్.. బీజేపీ ప్రచార అస్త్రంలా మారకూడదని.. ఇలాంటి సినిమాలను ప్రసారం చేయడం ద్వారా ఎన్నికల ముందు మత ఘర్షణలు చెలరేగే అవకాశముందని ఆయన అన్నారు. ఇలా దేశభక్తి మాటున మతోన్మాదాన్ని బీజేపీ రెచ్చగొడుతూనే ఉంది. మనది హిందూస్తాన్ దేశమంటూ ఇతర మతస్తుల పట్ల వివక్షతను ఎత్తి చూపే చిత్రాల ద్వారా మత రాజకీయం చేస్తోందని.. భిన్నత్వంలో ఏకత్వమన్న గొప్ప పేరును రూపుమాపే ప్రయత్నం చేస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు.
విమర్శలు ఎన్నైనా డోంట్ కేర్ అంటూ అదే సీన్ రిపీట్ చేసింది బీజేపీ. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో హిందూ నినాదంతోపాటు మరిన్ని తమకు అనుకూలంగా ప్రచారానికి పనికి వచ్చే చిత్రాలను రూపొందించి అస్ర్రాలుగా మార్చుకుంది. అలా తెరకెక్కిన చిత్రాల్లో నిజాం పాలనపై రజాకార్, కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, మావోయిస్టులే టార్గెట్‌గా బస్తర్ చిత్రాలు విడుదల య్యాయి. ఇప్పుడు ముస్లింలే లక్ష్యంగా మరో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.
లోక్‌సభ ఎన్నికల వేళ 2024లోనూ జనవరి నుంచి హిందుత్వ సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో స్వతంత్ర వీర్ సావర్కర్ వీటిలో మొదటిది. వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీనిలో వీర్ సావర్కర్ పాత్రను రణ్‌దీప్ హుడా పోషించారు. ఈ సినిమాకు దర్శకుడు కూడా ఆయనే. మార్చి 22న ఈ సినిమా విడుదలైంది. అయితే, హిందూ కోణంలో చూపించేందుకు కొన్ని వాస్తవాలను దీనిలో తారుమారు చేశారని ఈ చిత్రంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఆ తర్వాత జేఎన్‌యూ జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాకు వినయ్ శర్మ దర్శకత్వం వహించారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పరిణామాలే కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. దీనిలో ఊర్వశీ రౌతెలా, సిద్ధార్థ్ భోట్కే, విజయ్ రాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా ప్రగతిశీల విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ప్రశ్నించేవారిని దేశద్రోహులుగా చూపించే ప్రయత్నంలో వెలువడిందనే విమర్శలున్నాయి.
ఆ తర్వాత వచ్చిన ఆర్టిల్ 370 సినిమా విడుదలైంది. ఈ సినిమాకు ఆదిత్య సుహాస్ జంబాలే దర్శక త్వం వహించారు. దీనిలో యామీ గౌతమ్, ప్రియమణి, అరుణ్ గోవిల్ తదితరులు నటించారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పరిణామాల ఆధారంగా తెరకెక్కి ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదలైంది. అలాగే మే అ టల్ హూ’ సినిమాను రవీ జాదవ్ తెరకెక్కించారు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ జీవితం ఆధారంగా ఆ సినిమా తెరకెక్కింది. దీనిలో అటల్ పాత్రను పంకజ్ త్రిపాఠీ పోషించారు. ఈ సినిమా జనవరి 19న విడుదలైంది. 20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 8.5 కోట్ల రూపాయాలు మాత్రమే వసూలు చేసింది.
ఇక మరో చిత్రం రజాకార్. నిజాం కాలంలో హైదరాబాద్ సంస్థానంలో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. దీనిలో బాబీ సింహా, తేజ్ సబ్రు, వేదిక తదితరులు నటించారు. ఈ చిత్రం మార్చి 15న ఈ సినిమా విడుదలైంది. అయితే, కేవలం హిందూ కోణంలోనే దీన్ని చూపించారన్న విమర్శలు మూటగట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన చిత్రం యాక్సిడెంట్ ఆర్ కాన్‌స్పిరసీ: గోధ్రా. ఈ సినిమా 2002లో గుజరాత్‌లోని గోధ్రా అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కింది. దీనికి ఎంకే శివాక్ష్ దర్శకత్వం వహించారు. గోధ్రా అల్లర్లపై నానావతీ కమిషన్ రిపోర్ట్ ఈ సినిమాకు ఆధారం. మార్చి నెలలలో ఈ సినిమా విడుదలైంది. ఇక తాజాగా విడుదలైన బస్తర్ సినిమా కూడా ఇదే కోవకు చెందింది.ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే మూడేళ్లలో దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చుతామని కేంద్ర హోంమంత్రి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన బస్తర్ సినిమా వివాదానికి దారితీసింది. మావోయిస్టు ఉద్యమంపై దుష్ప్రచారం చేసేందుకు ఈ సినిమా ను తీశారని పలువురు విమర్శిస్తున్నారు.
ఇక ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న హమ్ దో హమారే బరాహ్ సినిమాపై వివాదం నెలకొంది. వచ్చేనెల విడుదలకానున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముస్లింలను ఉద్దేశించి ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. ముస్లింలలో మహిళలను కేవలం పిల్లలను కనేవారిగానే చేస్తున్నారని, దేశ జనాభా కూడా పెరుగుతోం దంటూ ముస్లిం సంప్రదాయాలను కించపరిచే ఉద్దేశంతోనే చిత్రం నిర్మించారంటూ మండిపడుతున్నారు. కమల్ చంద్ర దర్శకత్వం వహించిన హమ్ దో హమారే బరాహ్ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో అన్నూ కపూర్, పార్థ్ సమతాన్, అశ్విని కల్సేకర్, మనోజ్ జోషి, పరితోష్ త్రిపాఠి, రాహుల్ బగ్గా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
మొత్తంగా సినిమాను తమ హిందుత్వ రాజకీయాల ప్రచారంలో కీలకాస్త్రంగా మారిందనేది వాస్తవమం టున్నారు రాజకీయ పండితులు. వాస్తవాలను, చరిత్రను వక్రీకరించి సమాజంలో తప్పుడు అభిప్రాయాల ను పాదుకొల్పేందుకే ఇలాంటి చిత్రాలను రూపొందిస్తున్నారని విమర్శిస్తున్నారు.


