టీడీపీ నేతలు చేపట్టిన ఛలో మాచర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో దేవినేని ఉమా, వర్ల రామయ్య, నక్క , ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, జీవి ప్రకాష్ తదితర కీలక నేతలు పాల్గొనాలని నిర్ణయించడంతో తెలుగుదేశం నేతలంతా మాచర్ల వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఎక్కడికక్కడ టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వారు బయటకు రాకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను కూడా గృహ నిర్బంధం చేశారు. ఏపీలో మరోసారి గొడవలు జరగకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ తలపెట్టిన ఛలో మాచర్ల పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఛలో మాచర్ల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, టీడీపీ నేతలు జూలకంటి బ్రహ్మరెడ్డి, కనపర్తి శ్రీనివాసరావులను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ గూండాల దాడిలో గాయపడిన తమ కార్యకర్తలను కూడా పరామర్శ చేయనీయరా అంటూ మండిపడుతున్నారు.
ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతల దాడులలో గాయపడిన బాధితులను పరామర్శించాలని నిర్ణయించారు. మాచర్ల టీడీపీ ఇన్ చార్జ్ జూలకంటి బ్రహ్మరెడ్డి ఇంటి నుంచి బృందం బయలుదేరేందుకు సిద్ధమయింది. అయితే ఛలో మాచర్లకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఈ క్రమంలో హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన ఘర్షణలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కౌంటింగ్ జరిగే వరకు నిఘా పెంచాలని ఆదేశించింది. ఈ సమయంలో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి, వెంటనే ఆయనను అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో మాచర్లలో భారీగా పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఈ క్రమంలో చలో మాచర్లకు టీడీపీ పిలుపునిచ్చింది. అయితే టీడీపీ చలో మాచర్లకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. మాచర్లలో 144 సెక్షన్ విధించారు. ఆజ్ఞలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవంటూ SP అల్టిమేటం జారీ చేశారు.


