పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సుడిగాలి పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. మరోపక్క రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే అంచనాలు పెట్టుకుంది ఏఐసీసీ. మరి రేవంత్‌పై హైకమాండ్ పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయా..?, పార్లమెంట్ ఎన్నికల్లోనూ హస్తం హవా చాటుతుందా…?, డబుల్ డిజిట్ స్థానాలు సాధ్యమేనా..?
పార్లమెంట్ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇక ఎన్నికలకు సమయం దగ్గరపడ టంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే 14 సీట్లు టార్గెట్‌గా సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారంలో స్పీడ్ పెంచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి అధికారాన్ని చేజిక్కిం చుకుని ఫుల్ జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోరును సాగించాలన్న కుతూహలంలో ఉంది. మరోపక్క అసాధ్యాన్ని సుసాధ్యం చేసి.. 10 ఏళ్ల తర్వాత పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకువచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిపై ఏఐసీసీ భారీ అంచనాలు పెట్టుకుంది. హైకమాండ్ ఆశిస్తున్నట్టు డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు సాధించి సోనియాకు గిఫ్ట్‌గా ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు రేవంత్. ఇందులో భాగంగానే సుడిగాలి పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు, సభలతో బీజేపీ, బీఆర్ఎస్లే టార్గెట్‌గా విరుచుకుపడుతూ ఓటర్లను ఆకర్షించే పనిలో బిజీ అయ్యారు.
పార్లమెంట్ ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే టి.కాంగ్రెస్ వరుస సభలు, సమావేశాలు నిర్వహిస్తూ వచ్చింది. మేనిఫెస్టో విడుదల చేసే నాటికి కొందరు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూకుడు పెంచింది. అలాగే భారీ ఎత్తున తుక్కుగూడలో జనజాతర సభ నిర్వహించి జనాన్ని ఆకర్షించింది. అదే సభలో మేనిఫెస్టోను విడుదల చేసి ఎన్నికల హామీలపై భరోసా ఇచ్చింది. మరోపక్క ఏప్రిల్ 15 నుంచి సీఎం రేవంత్ భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టి ప్రచారంలో స్పీడ్ పెంచారు. తన సొంత పార్లమెంట్ ఇలాఖాలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నది ప్రెస్టేజ్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే నారాయణపేట జనజాతర సభ వేదికగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి పునాది వేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి గెలుపొందిన కొడంగల్ నియోజకవర్గం మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజక వర్గంలో భాగమే కాబట్టి.. అక్కడ పాగా వేయాలని గట్టి పట్టుతో ఉన్నారు. దీంతో వరసగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు రాజకీయ పరిస్థితులపై చర్చిస్తూ.. దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ల వైఫల్యాలను ఎండగట్టి ఓట్లను రాబట్టేందుకు కార్నర్ మీటింగ్‌లు, బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తించారు. మహబూబ్ నగర్ బహిరంగ సభ వేదికగానే ప్రభుత్వాన్ని పడగొట్టా లని ఎవరైనా చూస్తే.. కాంగ్రెస్ కార్యకర్తలు మానవ బాంబులు అవుతారు అనే హాట్ కామెంట్స్ సైతం చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటమిపాలైతే ప్రతిపక్షాల విమర్శలు ఏ రేంజ్లో ఉంటాయో ముందే ఊహించిన రేవంత్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. మరోపక్క మహబూబ్‌నగర్ పార్లమెంట్లో భాగం అయిన నారాయణపేట నుంచే ప్రచారాన్ని మొదలు పెట్టిన సీఎం.. మహబూబ్ నగర్ బహిరంగ సభతోనే ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు. అంతేకాకుండా 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో అత్యధిక సభలు నిర్వహించింది కూడా సీఎం సొంత పార్లమెంట్ నియోజకవర్గంలోనే అంటే.. ఇక్కడి గెలుపును ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమైపో తుంది. ఇక మహబూబ్‌నగర్ తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ లపై ఫోకస్ పెట్టిన రేవంత్.. మూడు బహిరంగసభలు నిర్వహించారు. అలాగే నాగర్ కర్నూలు, వరంగల్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్ లలోనూ రెండు బహిరంగ సభలు, పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మంలలో ఒక్కో సభ నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పలుచోట్ల కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలకు ప్రాధాన్యతనిచ్చిన సీఎం రేవంత్ అత్యధికంగా చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరిలోనే నిర్వహిస్తున్నారు. ఈ మూడు నియోజక వర్గాలు కూడా హైదరా బాద్ సరౌండింగ్స్‌లో ఉండటం ఒక కారణమైతే, ఆ మూడు నియోజకవర్గాల అభ్యర్థులు కూడా ఇటీవల BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలు కావడం విశేషం.
మొత్తంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారాన్ని చూసుకుంటే, పదిహేడు పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్ 26 బహిరంగ సభలు, 27 కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. అందులో అత్యధికంగా మహబూబ్ నగర్లో బహిరంగ సభలు నిర్వహించగా.. చేవెళ్లలో కార్నర్ మీటింగ్స్, రోడ్‌షోలు నిర్వహించారు. అలాగే 5 ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేశారు. ఇకపోతే నల్గొండ, హైదరాబాద్ నియోజకవర్గాలను అసలు టచ్ చేయ లేదు. మరి సీఎం రేవంత్ జోరుగా ప్రచారం చేసి,ప్రెస్టేజ్ ఇష్యూగా భావిస్తున్న మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ విజయం ఢంకా మోగిస్తుందా అంటే, అక్కడ హస్తం హవాతోపాటు బీజేపీ జోరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి సొంత ఇలాఖాలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించి, విపక్షాల ముందు మీసం మెలే స్తారా..? లేదంటే ప్రతిపక్షాలదే పై చేయి అవుతుందా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. మరి ఆ ఆసక్తికర పరిణామాల ఫలితాలు తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.


