గాంధీ కుటుంబానికి కంచుకోట రాయ్ బరేలీ. రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించేం దుకు పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ పార్టీ సర్వశక్తులూ పణంగా పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కేరళలోని వయినాడ్ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి కూడా పోటీ చేయాలన్న నిర్ణయం ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇదే స్ఫూర్తితో విజయ సాధనే లక్ష్యంగా సాగుతోంది 139 ఏళ్ల పార్టీ…
రాయ్ బరేలీతో దాదాపు 70 ఏళ్లుగా గాంధీ కుటుంబానికి గొప్ప అనుబంధం. చరిత్ర ఉంది. రాహుల్ గాంధీ తాత. రాజీవ్ గాంధీ తండ్రి ..ఇందిరాగాంధీ భర్త అయిన ఫిరోజ్ గాంధీ 1952 లో తొలిసారిగా రాయ్ బరేలీ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. మళ్లీ 1957 లోనూ అదే స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1960 సెప్టెంబర్ 8న మరణించారు. అనంతరం 1967 నుంచి ఫిరోజ్ గాంధీ సతీమణి, అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ రాయ్ బరేలీకి ప్రాతినిధ్యం వహించారు. 1971 లోనూ, 1980 లోనూ ఇందిరా గాంధీ ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. తర్వాతి కాలంలో గాంధీ కుటుంబానికి సన్నిహితులైన అరుణ్ నెహ్రూ, షీలా కౌల్, సతీశ్ శర్మ వంటి వారు ప్రాతినిధ్యం వహించినా, కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత సోనియాగాంధీ 2004, 2009, 2014, 2019 లో రాయ్ బరేలీ నుంచి ఎన్నికయ్యారు. సోనియాగాంధీ 2024లో రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆ స్థానే రాహుల్ గాంధీని పోటీకి నిలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
అమేథీ లోక్ సభ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ కుటుంబానికి కంచుకోటే. 1980లో ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ తొలిసారిగా అమేథీ నుంచి ఎన్నికయ్యారు. ఆయన మరణానంతరం రాజీవ్ గాంధీ 1981 నుంచి 1991 వరకూ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత 1999 లో సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. 2004, 2009, 2014 లో వరుసగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఎన్నికవుతూ వచ్చారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విజయం సాధించడంతో గాంధీ కుటుంబం విజయాలకు అడ్డుకట్ట పడింది. 2024 లో గాంధీ నెహ్రూ కుటుంబంతో అనుబంధం ఉన్న కిషోరీలాల్ శర్మ ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ, అమేథీ లోక్ సభ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నిక కావడంతో రాయ్ బరేలీ .. నియోజక వర్గంపై తమ పట్టు సడలని వ్వరాదన్న కృత నిశ్చయంతో తానే పోటీ చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయించు కున్నారు. రాయ్ బరేలీలో 2019లో సోనియా గాంధీ చేతిలో ఓటమి పాలైన బీజేపీ అభ్యర్థి దిపేశ్ ప్రతాప్ సింగ్ తోనే రాహుల్ తలపడనున్నారు. అమేధీలో బీజేపీకి చెందిన స్మృతి ఇరానీతో కిషోరీ లాల్ శర్మ పోటీ పడనున్నారు. ఇద్దరు మాజీముఖ్యమంత్రులు, భూపేష్ బాఘేల్, అశోక్ గెహ్లోట్ ను రాయ్ బరేలీ, అమేధీలకు ఏఐసీసీ పరిశీలకులుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. రాయ్ బరేలీ, అమేథి నియోజకవర్గాల గెలుపు బాధ్యతలను ప్రియాంక గాంధీ వద్రా తన భుజస్కంధాలపై వేసుకున్నారు. మే 6 నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకూ రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లోనే తాను ఉండి, ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తానని రాహుల్ నామినేషన్ నాడే ప్రియాంక ప్రకటించడం విశేషం. ప్రియాంక పర్యవేక్షణలోనే ప్రచారం షెడ్యూల్, ప్రణాళికలు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో చత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ బాఘేల్, రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ ప్రియాంకకు తోడుగా ఉంటారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యవేక్షిస్తారు. ప్రియాంక రెండు నియోజకవర్గాల్లోనూ దాదాపు 250 నుంచి 300 గ్రామాల్లో సుడిగాలి ప్రచారంతో హోరెత్తిస్తారు. వందలాది కార్నర్ మీటింగ్ లు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలు చేపడతారు.లోక్ సభ ఎన్నికల ఐదో విడత లో మే 20న రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాలకు ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్ ప్రతిష్టా త్మక స్థానాలను ఏ మేరకు నిలబెట్టుకుంటుందో చూడాలి.


