తెలంగాణ ఎన్నికల్లో రిజర్వేషన్లు, రాజ్యాంగం కీలక అంశాలుగా మారాయి. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన బడుగు, బలహీనవర్గాల హక్కులు రిజర్వేషన్లతోనే సాధ్యమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఎన్నికల ప్రచారంలో బడుగు, బలహీనవర్గాలకు పిలుపునిచ్చారు. అయితే కాంగ్రెస్ నాయకుల ప్రచారాన్ని తోసిపుచ్చింది భారతీయ జనతా పార్టీ. బడుగు, బలహీనవర్గాల రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామంటున్నారు కమలం పార్టీ నాయకులు.
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కిందటినెల 23న ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట సభలో పాల్గొన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని అమిత్ షా తెగేసి చెప్పారు.అంతేకాదు తాము తిరిగి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్‌లను రద్దు చేస్తామని కుండబద్దలు కొట్టారు అమిత్ షా. అయితే మొత్తంగా అన్ని రకాల రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈమేరకు డీప్ ఫేక్ వీడియో ఒకటి వెలుగు చూసింది. అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ….ముస్లిం రిజర్వేషన్ల రద్దు అనే మాటను రిజర్వేషన్ల రద్దు అనే విధంగా ఎడిట్ చేసి మార్ఫింగ్ వీడియో రిలీజ్ చేశారని కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ఆరోపించింది. సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని బీజేపీ ఘాటు ఆరోపణలు చేసింది.
డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మరో నలుగురు కాంగ్రెస్ నేతలపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్స్ విభాగం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ 153,153 ఏ, 465,469,171 జీ, 66 సీ ఐటీ సెక్షన్ల కింద సైబర్ క్రైమ్స్ విభాగం కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే..అమిత్ షా వీడియోను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ఢిల్లీ పోలీసులకు బీజేపీతో పాటు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ కూడా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజా తెలంగాణ పర్యటనలో కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. దేశ భవిష్యత్‌కు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు కీలకంగా మారాయన్నారు నిర్మల్ ఎన్నికల ప్రచారసభలో రాహుల్ గాంధీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను అలాగే వారి హక్కులను కాంగ్రెస్ పార్టీయే కాపాడ గలదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
ఇక తెలంగాణలో హల్‌చల్ చేస్తున్న మరో అంశం రాజ్యాంగ పరిరక్షణ. రాజ్యాంగంపై కర్ణాటకకు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే కొన్ని రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపాయి. రాజ్యాంగం భగవద్గీత, బైబిల్, ఖురాన్ కాదన్నారు అనంత్ కుమార్ హెగ్డే. అవసరమనుకుంటే రాజ్యాంగాన్ని మార్చవచ్చనీ, ఇందులో ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో హిందువులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను పక్కనపెట్టాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందన్నారు అనంతకుమార్ హెగ్డే. ఇందుకు పార్లమెంట్ ఉభయసభల్లో, రాష్ట్రాల్లో మూడింట రెండువంతుల మెజారిటీ బీజేపీకి అవసరమని అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అనంత కుమార్ హెగ్డే వ్యాఖ్యలతో జరగబోయే నష్టాన్ని బీజేపీ అధిష్టానం పసిగట్టింది. వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. సాక్షాత్తూ అంబేద్కరే వచ్చినా, రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యంకాదని ప్రధాని నరేంద్ర మోడీ స్వరం మార్చారు. రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం లేదన్నారు నరేంద్ర మోడీ. అయితే రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేమిటి అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించిన ఎంపీ అనంత కుమార్ హెగ్డేపై బీజేపీ అగ్రనాయకత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం.
అనంత కుమార్ హెగ్డే వ్యాఖ్యలపై మండిపడింది కాంగ్రెస్ పార్టీ. ప్రధాని నరేంద్ర మోడీ, సంఘ్ పరివార్ ఉద్దేశాలను బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యలు బట్టబయలు చేస్తున్నాయని ఏఐసీసీ అధ్యక్షు డు మల్లికార్జున ఖర్గే. కాగా నిర్మల్ ప్రచార సభలో రాజ్యాంగం మార్పు అంశాన్ని కూడా ప్రస్తావిం చారు రాహుల్. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలను సంవిధాన్ , సంఘ్‌విధాన్‌ల మధ్య జరుగుతున్న పోరాటంగా రాహుల్ అభివర్ణించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు రెండు సమూహాల మధ్య జరిగే యుద్దం గా మారిందన్నారు రాహుల్ గాంధీ. బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ సమూహం ఒకవైపు ఉంటే, రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్రలు చేస్తున్న బీజేపీ సమూహం మరోవైపు ఉందన్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఎవరివైపు ఉండాలో తేల్చుకోవాల్సింది ప్రజలే అన్నారాయన.
ఇదిలా ఉంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాహుల్ గాంధీ అభినందించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తావించారాయన. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి ఏడాది రూ. 16 లక్షల కోట్లు పేదలకు అందచేయవచ్చన్నారు రాహుల్. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఆ పనిచేయడం లేదన్నారు. దేశ సంపదను మిత్రులకు పంచడంలో ప్రధాని నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ. మొత్తానికి రిజర్వేషన్లు,రాజ్యాంగం మార్పు అంశాల చుట్టూ తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం తిరుగుతున్నాయి. ఈ విషయం లో ఎవరి వైపు ఉండాల్సిందో తేల్చుకోవాల్సింది ప్రజలే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.