లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణపై ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో కనీసం 15 సెగ్మెంట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం పక్కా ప్రణాళిక రూపొందించుకుంది. ఇందులో భాగంగా తాజాగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.
హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక మేనిఫెస్టో తెలుగు ప్రతిని తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహా పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యరు. ఈ సందర్భంగా దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తరువాతే తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించామన్నారు. ప్రత్యేక మేనిఫెస్టో రూపకల్పనకు పెద్ద ఎత్తున కసరత్తు చేశామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు సమాజంలోని వివిధ సంఘాల నాయకులతో తాము సంప్రదింపులు జరిపామన్నారు. తెలంగాణ సమాజానికి మేలు చేసే ప్రతి ఒక్క అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరచినట్లు శ్రీధర్ బాబు వివరించారు. తెలంగాణకు సంబంధించి కీలకమైన 23 అంశాలను పొందుపరిచామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రత్యేమ మేనిఫెస్టో ను అమలు చేస్తామన్నారు శ్రీధర్ బాబు.
విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలను ప్రత్యేక మేనిఫెస్టోలో చోటు కల్పించారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడతామని పదేళ్ల కిందట అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఈ పదేళ్ల కాలంలో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ అంశాన్ని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అలాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన మరో హామీ. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఉత్తర తెలంగాణ ప్రాంతం రైల్వే రవాణాపరంగా అనేక విధాలుగా అభివృద్ది చెందుతుంది. అంతేకాదు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు చెందిన యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల లభిస్తాయి.
మేడారం జాతరకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అంతర్జాతీయంగా అతి పెద్ద గిరిజన జాతర మేడరమే. రెండేళ్లకు ఓసారి జరిగే ఈ జాతరలో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో మేడారం వస్తుంటారు. అయితే ఇంత ఘనకీర్తి ఉన్నా మేడారం జాతరకు ఇప్పటివరకు జాతీయ హోదా రాలేదు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా కేంద్రం పట్టించుకోలేదు. జాతీయ హోదా వస్తే మేడారం జాతరకు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు లభిస్తాయి. ఈ నేపథ్యంలో మేడారం జాతర అంశాన్ని ప్రత్యేక మేనిఫెస్టోలో ఒక అంశంగా పెట్టింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ లో సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ కోసం న్యాయవాదులు ఎప్పటి నుంచో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తే కక్షిదారులు ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాదు కేసుల విచారణ కూడా త్వరగా జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా ప్రత్యేక మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్ పార్టీ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తొలి రోజుల్లోనే భద్రాచలం సమీపాన గల అనేక గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఇలా ఏపీలో విలీనమైన గ్రామాలు తమవే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ గ్రామాలను తిరిగి తెలంగాణ కు తీసుకువస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ హై కమాండ్. తెలంగాణలో విద్యాభివృద్ధి కోసం కేంద్రీయ విద్యాలయాలు అలాగే నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయమై కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా, కేంద్రం నుంచి ఉలుకు పలుకూ లేదు. దీంతో ఈ అంశాన్ని కూడా ప్రత్యేక మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారంటీలో భాగంగా ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొ న్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు శ్రీధర్ బాబు. మొత్తం మీద ప్రత్యేక మేనిఫెస్టోతో తెలంగాణలో తమ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.


