పార్లమెంట్ ఫైట్‌లో మెజార్టీ స్థానాలే బీఆర్‌ఎస్ లక్ష్యమా..?, ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడం గులాబీకి సవాల్‌గా మారిందా..? ఇంతకు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వ్యూహం ఏంటి…?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్లమెంట్ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు సవాల్ మారాయి. తమ ఉనికిని కాపాడుకుంటూ సత్తా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ ఓటు బ్యాంక్‌ను పెంచుకోవడంపై దృష్టి సారించింది. అందు కోసం సర్వశక్తులను ఒడ్డుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ధీటుగా ఓట్లను సాధించడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ.. 9 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 4, కాంగ్రెస్ 3 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకు న్నాయి. ఇక బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఎలాగైనా కాంగ్రెస్, బీజేపీల కంటే అధిక సీట్లు సాధించి పైచేయిగా నిలవాలన్న కలలు కంటోంది. అందుకు తగ్గట్టుగా పక్కా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతోంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 39.40 శాతం ఓట్లను సాదించి… 64 స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రతిపక్ష స్థాయికి చేరిన బీఆర్‌ఎస్ 37.35 శాతం ఓట్లను సాధించి.. 39 స్థానాల్లో గెలుపొందింది. రెండు పార్టీల మధ్య కేవలం 1.85 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది. మొత్తంగా ఓట్లు చూసుకుంటే.. 92 లక్షల 35 వేల 833 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాగా.. బీఆర్‌ఎస్‌కు 87 లక్షల 53 వేల 956 ఓట్లు సాధించి ప్రతిపక్ష హోదాలో చేరింది. దీంతో లోక్ సభ ఎన్నికలు బిఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక గతసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 41.71 శాతం ఓట్లతో 9 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 19.65 శాతం ఓట్లతో నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే కాంగ్రెస్ 29.79 శాతం ఓట్లతో మూడు స్థానాల్లో విజయం సాధించింది. అయితే.. ప్రస్తుతం బీఆర్‌ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ తన ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది.
ఇదిలా ఉంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు తయారైంది బీఆర్‌ఎస్ పరిస్థితి. గడ్డు పరిస్థితుల్లో ఉన్న గులాబీ బలగానికి ఆర్థిక భారం వెంటాడుతోంది. బిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండటంతో అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఫైనాన్స్ చేసినా.. ఓటమిని ముందే గ్రహించిన అభ్యర్థులు డబ్బులు ఖర్చు చేయలేదన్న టాక్ నడుస్తోంది. ఈ ఎన్నికల్లోనూ అదే జరుగుతున్నట్టు సమాచారం. గులాబీ బాస్ అభ్యర్థులకు ఫైనాన్స్ చేసినా ఖర్చు చేయడానికి వారి మనసు ఒప్పుకోవడం లేదని.. క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. మాడు పగిలే ఎండల్లో ప్రచారం చేస్తుంటే తమను పట్టించుకోవడం లేదన్న విమర్శ వినిపిస్తోంది. అధికారం కోల్పోయి ఆరు నెలలు కాక ముందే ఫైనాన్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తితే.. తమ పరిస్థితి ఏంటని క్యాడర్ ప్రశ్నిస్తోంది. అభ్యర్థులు ఇలాగే వ్యవహరిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఫైనాన్స్ గండం తీరని నష్టం చేస్తుందన్న చర్చ సాగుతోంది.
ఇక రాష్ట్రంలో పార్లమెంట్ ఫైట్ హోరాహోరీగా సాగుతోంది. బీఆర్‌ఎస్ 17 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపింది. అయితే,.. ఈ సారి జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్, బీజపీలో చేరి ప్రత్యర్థులుగా బరిలో కాలు దువ్వుతున్నారు. ఇన్నాళ్లూ తమ వెంటే ఉండి.. అధికారం కోల్పోయేసరికి పక్క పార్టీల్లోకి జంప్ అయి గులాబీపైనే పోటీకి సై అంటున్నారు. దీంతో ఎలాగైనా వారిని ఓడించాలన్న కసిలో ఉన్న గులాబీ బాస్.. ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. బస్సుయాత్రతో రంగంలోకి దిగారు. ఓ వైపు కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూనే.. క్యాడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ నిర్వహిస్తూ ఓటర్లను తమవైపుకి తిప్పుకునే వ్యూహంలో ఉన్నారు. మరి గులాబీ బాస్ వ్యూహాలు ఫలిస్తాయా..? కేసీఆర్ ఆశిస్తున్నట్టు బీఆర్‌ఎస్ బలం పుంజకుంటుందా..? తమ ఓటు బ్యాంక్ పదిలమేనా..? పార్లమెంట్ ఫైట్‌లో బీఆర్‌ఎస్ సత్తా చాటుతుందా..? మరింత చతికిలపడుతుందా..? తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.


