తెలంగాణ లోక్‌సభ రాజకీయాల్లో ఒక అనూహ్య సంఘటన ఇది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రిజర్వేషన్లపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ఫేక్ వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి వైరల్ చేశారంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో మే ఒకటో తేదీన విచారణకు హాజరు కావలసిందిగా కోరుతూ రేవంత్ రెడ్డికి నోటీసులు అందజేశారు.
రేవంత్ రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నాయకులకు కూడా నోటీసులు అందచేశారు. వీరిలో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చైర్మన్ మన్నె సతీశ్, కో ఆర్డినేటర్ నవీన్, పీసీసీ కార్యదర్శి శివకుమార్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అస్మా తస్లీం ఉన్నారు. ఢిల్లీ పోలీసుల తరఫున ప్రత్యేక విభాగం ఇన్స్పెక్టర్ నీరజ్ చౌధురీ పేరుతో ఈ నోటీసులు అందచేశారు. విచారణకు హజరు కాకపోతే, సిఆర్పీసీ నిబంధనల కింద చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫేక్‌గా భావిస్తున్న వీడియో ఎక్కడ నుంచి వచ్చింది. ఎవరెవరికి షేర్ చేశారు అనే వివరాలు అన్నిటినీ వెల్లడించాలని రేవంత్ రెడ్డి సహా మరో నలుగురిని ఢిల్లీ పోలీసులు నోటీసుల్లో కోరినట్లు సమాచారం.
సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోను, పోస్ట్ చేయడానికి ఉపయోగించిన ల్యాప్‌టాప్ లేదా మొబైల్ లేదా ట్యాబ్లెట్‌ను అలాగే ఈ వీడియోను ఎక్కడి నుంచి తీసుకున్నారో అందుకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని విచారణకు వచ్చే సమయంలో వెంట తీసుకురావాలని నోటీసుల్లో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం సూచించింది. నోటీసుల నేపథ్యాన్ని పరిశీలిస్తే, తెలంగాణలో ఇటీవల ఓ సభలో ప్రసంగిస్తూ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగవిరుద్ధమైన ముస్లిం రిజర్వేష న్లను రద్దు చేస్తామని వెల్లడించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన వారి హక్కులను వారికే తిరిగి ఇచ్చేస్తామన్నారు. అయితే మొత్తంగా రిజర్వేషన్లను రద్దు చేస్తామని రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్లు గా వీడియోను ఎడిట్ చేశారని తెలంగాణ బీజేపీ ఆరోపించింది. అంతేకాదు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, అన్ని రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ప్రచారసభల్లో రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్లను రద్దు చేస్తామని తాను అనలేదని అమిత్ షా వివరణ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి సహా మరో నలుగురు కాంగ్రెస్ నేతలపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్స్ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ 153,153 ఏ, 465,469,171 జీ, 66 సీ ఐటీ సెక్షన్ల కింద సైబర్ క్రైమ్స్ విభాగం కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే, అమిత్ షా వీడియోను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ఢిల్లీ పోలీసులకు బీజేపీతో పాటు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదుపై కేంద్ర హోమ్ శాఖ సీరియస్‌గా స్పందించింది. తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్ను పరిగణన లోకి తీసుకుని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం రేవంత్ రెడ్డి సహా మరో నలుగురిపై కేసు రిజస్టర్ చేసింది. ముఖ్యమంత్రి నివాసంలో అందచేసిన తరువాత గాంధీభవన్‌కు వచ్చి మిగతా కాంగ్రెస్ నాయకులకు నోటీసులు ఇచ్చింది ఢిల్లీ పోలీసుల బృందం. కేంద్ర హోమ్ శాఖమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం, తనకు నోటీసులు అందచేయడం పై కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసు అలాగే నోటీసులు అందచేయడంపై తాను భయపడేది లేదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. బీజేపీ ప్రభుత్వ విధానాలపై ఎవరు పోరాటం చేసినా, వారిపై కేసులు పెట్టడం, నోటీసులు ఇవ్వడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా మారిందని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.
2014లో తొలిసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ప్రారంభమైందన్నారు రేవంత్ రెడ్డి. లోక్‌సభ ఎన్నికలు వచ్చినప్పుడల్లా, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు, బీజేపీ ప్రత్యర్థుల పై కేసులంటూ వస్తున్నారని ఆరోపిం చారు. మొత్తంమీద రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేయడం దుమారం రేపింది.


