జాతీయ పోలీసు దళానికి స్వతంత్ర ప్రతిపత్తి సాధ్యమా?

     భారతదేశానికి సమగ్రమైన జాతీయ పోలీసు దళం ఏర్పాటు అవసరం ఉందా. ఈ మధ్య పలు రాష్ట్రాల్లో పోలీసుల కు, కేంద్ర బలగాలకు మధ్య తరచు ఘర్షణలు జరుగుతుండడంతో ఇది చర్చనీ యాంశమైంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పోలీసు బలగాలకు, కేంద్ర ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలకు మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. పరస్పరం నమ్మకం, విశ్వాసం లోపిం చింది. ఇది దేశ భద్రతకు మంచిది కాదని భద్రతా నిపుణులు పేర్కొంటున్నారు. జాతీయ పోలీసు దళం స్వతంత్ర ప్రతిపత్తితో నిష్పక్షపాతంగా వ్యవహరించేదిగా ఉండాలని నిపుణులు ఆకాంక్షిస్తున్నారు.

     అఖిల భారత అధికార పరిధి గల జాతీయ పోలీసు వ్యవస్థ ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు, చత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల్లో జరిగిన ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పోలీసుల కు, కేంద్ర ఏజెన్సీలైన సీబీఐ, ఎన్ఐఏ, ఎన్సీబీ, కస్టమ్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖల మధ్య తరచు ఘర్షణలు తలెత్తుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఎన్ ఐఏ అధికారులపై దుండగుల దాడి సంచలనంగా మారింది. 2022 డిసెంబర్ లో బెంగాల్ భూపతినగర్ పేలుడు జరిగింది. ముగ్గురు చనిపోయారు ఆ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ బృందం ఇద్దరు అనుమానితులను అరెస్టు చేయడం పై వివాదం చెలరేగింది. స్థానికుల మూక ఆ అరెస్ట్ లను అడ్డుకుంది. ఎన్ ఐఏ బృందంపై దాడి చేశారు. ఎన్ ఐఏ వాహనాలు ధ్వంసంచేసి, ఇద్దరు అధికారులను గాయపరిచారు. పశ్చిమ బెంగాల్ లోనే 24వ పరగణాజిల్లా లోని సందేశ్ ఖలీ లో 2024 జనవరి 5 న జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కల్గించింది. సందేశ్ ఖలీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారు లపై దాడి జరిగింది. ఆ కేసు పశ్చిమ బెంగాల్ పోలీసుల నుండి సిబిఐకి బదిలీ చేయడానికి కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకోవల్సి వచ్చింది. దాడికి సంబంధించి ఫిబ్రవరి 29న పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేసిన టీఎంసీ నేత షాజహాన్ షేక్ ను కేంద్ర ఏజెన్సీ కష్టడీకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

   తమిళనాడు లో 2023 మేలో ఇలాంటి మరో ఘటన. ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీ , ఆయన మద్దతు దారులు, కరూర్ జిల్లాలోని సెందిల్ బాలాజీ సోదరుడు అశోక్ కుమార్, ఇతరుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కొందరు అధికారులపై దాడి చేసి ఓ వాహనాన్ని ధ్వంసం చేశారు. అవినీతి ఆరోపణలతో మరో ఈడీ అధికారిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. చాలా రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్ధలకు, రాష్ట్ర పోలీసులకు మధ్య ఘర్షణలు, ఆరోపణ లు, ప్రత్యారోపణలు పెరుగుతున్నాయి. రాష్ట్రాల్లో పోలీసులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కనుసన్న ల్లో పని చేయడం, కేంద్ర పోలీసులను వేరుగా చూడడం. పోలీసులంతా ఒకటే అన్న భావన లోపించడం ఓ కారణం.

   కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఓ సంచలనం. ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఆమె సన్నిహితురాలు. దీంతో విజయన్ కు వ్యతిరేకంగా వాగ్మూలం ఇవ్వాలని కేంద్ర ఏజెన్సీలు బలవంతం చేయడంతో 2021 మార్చిలో కేరళ పోలీసులు ఈడీపై కేసునమోదు చేశారు. స్వప్న సురేశ్ ను ప్రశ్నించిన ఈడీ అధికారులు దొంగ సాక్ష్యాలు సృష్టించేందుకు సీఎంకు వ్యతిరేకంగా తప్పుడు స్టేట్ మెంట్లు ఇవ్వాలని బలవంతం చేశారని ఎఫ్ ఐఆర్ లో పేర్కొన్నారు. రెండు భద్రతా ఏజెన్సీ ల మధ్య ఘర్షణలకు, పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణం ఆయా పోలీసులు ఏదో ఓ రాజకీయ పార్టీకి విధేయులుగా మారడమే. రాజకీయపార్టీలు పోలీసు ఏజెన్సీలను విచ్చలవిడిగా వాడుకుంటూ రాజకీయం చేయడమే నని కేరళకు చెందిన ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పేర్కొన్నారు.

   ఢిల్లీలో పరిస్థితి మరో రకం. ఇక్కడ అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా.. పోలీసు యంత్రాంగ్ కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. శాంతి భద్రతల పరిస్థితి చక్కదిద్దాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదే అయినా పోలీసులు వారి పరిధిలో ఉండరు. దీంతో ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిరంత ర ఘర్షణ తప్పడం లేదు. తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, చత్తీస్ గఢ్, కేరళ, మిజోరం వంటి రాష్ట్రాలు సీబీఐకి సాధారణ అనుమతి ఉపసంహరించుకోవడం మరో వివాదానికి దారితీసింది. 1946 ఢిల్లీ స్పెషల్ పోలిస్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారం సిబిఐ ఏర్పడింది. సీబీఐ ఏదైనా రాష్ట్రంలో ఒక నేరాన్ని దర్యాప్తు చేయడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి పొందాలి. రాష్ట్ర ప్రభుత్వ స్పష్టమైన అనుమతి లేకుండా, సిబిఐ రాష్ట్ర సరిహద్దుల్లో అడుగు పెట్టదు. దీంతో కీలక కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతోంది.ఒక కేసు దర్యాప్తు రాష్ట్ర పోలీసులు చేయాలా, కేంద్ర పోలీసులు చేయాలా అన్నది ప్రజలు నిర్ణయించాలి. చాలా నేరాల దర్యాప్తు, ముఖ్యంగా మత ఘర్షణలు, రాజకీయ హత్యలు, అత్యాచారాలు వంటి కేసులను రాష్ట్ర పోలీసులే దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో లోపాలు, పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఎఫ్ ఐఆర్ నమోదు కోసం కోర్టులకు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది.

   కేంద్ర ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు, రాష్ట్ర పోలీసుల మధ్య అనవసరమైన విభేదాలను శాశ్వతంగా పరిష్కరించడానికి జాతీయ పోలీసు, జాతీయ జైళ్ల అథారిటీ ఏర్పాటు అనే రెండు సమస్యలను మోదీ ప్రభుత్వం 3.0 పరిష్కరించాల్సి ఉంది. అవసరమైతే రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అయితే రాజకీయ జోక్యం లేకుండా జాతీయ పోలీసు వ్యవస్థ స్వతంత్ర ప్రతి పత్తి గల సంస్థ వ్యవహరించాల్సి ఉంటుంది. అలాంటి ఆదర్శవంతమైన పోలీసు వ్యవస్థ సాధ్యమా.. ఆలోచించాలి .  

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్