సార్వత్రిక సమరంలో ఎన్నో వింతలు.. మరెన్నో విశేషాలు. ఎన్నికలు అంటేనే చాలా ఖరీదైన వ్యవహారం. వేలు, లక్షల నుంచి కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు వచ్చేశాయన్నది అందరూ చెప్పేమాట. అయితే.. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు, సమస్యలపై అవగాహన కల్పించే లక్ష్యంగా కొందరు సామాన్యులు ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నామినేషన్లు సమర్పించారు. అలాంటి వారి గురుంచి ఓ లుక్కేద్దాం.
ఎన్నికల్లో పోటీ చేయడమంటే మామూలు వ్యవహారం కాదు. అందుకే రాజకీయ పార్టీలు కూడా అంగ, అర్థ బలం పుష్కలంగా ఉన్న వారినే బరిలో దింపుతుంటాయి. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు అనే తేడా ఏ మాత్రం లేదు. అయితే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో దిగేవారి విషయం లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నమనే చెప్పాలి. ఇక్కడే ఇంకో కీలక అంశం ఉంది. ఇండిపెండెంట్ల లోనూ కొందరు అన్ని రకాలుగా బలంగా ఉండే వాళ్లు బరిలో దిగితే.. కొందరు మాత్రం సామాన్యులు సైతం తమ నామినేషన్లు వేస్తుంటారు. గతంలోనూ ఇలా చాలా సార్లే జరిగింది. అలాగే.. ప్రస్తుతం జరుగు తున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొందరు సామాన్యులు తమ నామినేషన్లు సమర్పిం చారు.
ఇలా సామాన్యుడిగా ఉండి నామినేషన్ సమర్పించిన వారిలో ఒకరు లెక్కల కొండయ్య. 73 ఏళ్ల వయసున్న కొండయ్య.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలుసమర్పించారు. నాలుగో తరగతి వరకు చదివిన కొండయ్య. రెవెన్యూ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. మండల కేంద్రాల్లో తిరుగుతూ మైక్ పట్టుకొని తిరుగుతూ ఆయా సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారు కొండయ్య. ఇదే క్రమంలో ఏ పార్టీకి అనుకూలంగానో, ప్రతికూలంగానో ఉండాలన్న ఆలోచనలు లేకుండా నామినేషన్ సమర్పించినట్లు చెప్పుకొచ్చారు కొండయ్య. ఈ సందర్భంగా తనకు 11 వేల రూపాయల విలువ చేసే చరాస్థులు, 9 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు లెక్కల కొండయ్య. ఇదే మాదిరిగా పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలోనూ ఓ సామాన్య వ్యక్తి బరిలో దిగారు. స్థానికంగా చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఏడిద భాస్కర్ రావు తన నామినేషన్ సమర్పించారు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న భాస్కర్ రావు. పిఠాపురంలోని ప్రభుత్వ కాలేజీ ముందు చెప్పులు కుట్టుకుంటూ కుటుం బాన్ని పోషించుకుంటున్నారు. ఎన్నికలు రావడంతో ప్రజల్లో రాజకీయాలపై అవగాహన కల్పించా లని, చైతన్యం తేవాలని భావించి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తన దగ్గర 20 వేల రూపాయల నగదు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు భాస్కర్ రావు. ఇలా ఎన్నికల వేళ పలువురు సామాన్యులు నామినే షన్లు వేయడం ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు, అవగాహన కల్పించేందుకు వీరు చేసిన ప్రయత్నాన్ని మాత్రం పలువురు ప్రశంసిస్తున్నారు.


