తెలంగాణ రాజకీయాలు మండు వేసవిలో భగభగా మండిపోతున్నాయి. రైతు రుణమాఫీ కేంద్రంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనకు మాజీ మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరితే..అంతే ధీటుగా ప్రతిసవాల్ చేశారు సీఎం రేవంత్. దీంతో రాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది.
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో హై ఓల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రైతు రుణమాఫీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్ల రాజకీయం పీక్ స్టేజ్‌కు చేరిపోయింది. అగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన సవాల్ మాటల యుద్ధానికి దారి తీసింది. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని, చేయకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. తన రాజీనామా లేఖను గన్‌పార్క్‌లోని అమర వీరుల స్తూపం వద్ద మేధావులకు ఇచ్చి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించి గన్‌పార్కు వద్దకు వచ్చానని..ఆగస్టు 15 లోపు రుణమాఫీ అమలు చేస్తే..తన రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వాలని కోరారు. ఒకవేళ రుణమాఫీ హామీలను అమలు చేయకపోతే..రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని చాలెంజ్ చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది.
అయితే హరీష్‌రావు సవాల్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఓ సీస పద్యాన్ని రాసుకుని పట్టుకొచ్చిన కాగితాన్ని రాజీనామా లెటర్ అంటూ హరీశ్ రావు డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజీనామా లేఖకు ప్రత్యేకంగా ఫార్మాట్ ఉంటుందని, అందులో ఒక్క అక్షరం అటూఇటైనా కూడా స్పీకర్ ఆమోదిం చరని చెప్పారు. అప్పుడు అది చిత్తు కాగితంతో సమానమని చెప్పారు. ఆరు నూరైనా సరే ఆగస్టు 15 లోపు రైతుల రుణాలు రూ.2 లక్షల లోపున్న వాటిని ఒక్కసారే మాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మరోవైపు హరీష్‌రావు రాజీనామా లేఖపై సెటైర్లు వేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. గతంలో తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నానని, ఇప్పుడు ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు హరీశ్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులపై ప్రేమ ఉన్నట్టు హరీశ్ నాటకాలు ఆడుతున్నారని అన్నారు. రాజీనామా పత్రం ఒకటిన్నర లైన్ మాత్రమే ఉండాలని, కానీ హరీశ్‌రావు ఒకటిన్నర పేజీ రాసుకొచ్చారని విమర్శించారు. నిజంగా హరీష్‌రావుకు రైతులపై ప్రేమ ఉంటే రాజీనామా లేఖను స్పీకర్‌కు సమర్పించాలని కోమటిరెడ్డి సవాల్ విసిరారు.ఇదిలా ఉంటే హరీష్ రావుకు ఇన్ని రోజులకు గన్‌పార్క్ గుర్తొచ్చిందా? అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులెవరూ పదవుల కోసం రారని చెప్పిన కేసీఆర్ మాటతప్పి…. పదవుల కోసమే పాకులాడినప్పడు ఎందుకు గన్‌పార్క్‌కు పోలేదని ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తానని వాగ్దానం చేసిన కేసీఆర్.. మాటమార్చితే ఎందుకు గన్‌పార్క్‌కు వెళ్లలేదని ప్రశ్నించారు. పదవుల కోసమే కేసీఆర్ తోక పట్టుకు తిరిగాడని విమర్శించారు. మొత్తానికి లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో సవాళ్ల పర్వం ఊపందు కుంది. నేతలు ఎక్కడా తగ్గడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉపయోగపడే ఏ చిన్న అంశాన్ని వదలడం లేదు. అయితే ప్రజల నాడి మాత్రం తెలియడం లేదు. మరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎటు వైపు ఉన్నారనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


