తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వానికి ఈసారి జరిగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు సవాల్‌గా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు….జాతీయ రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్లు, విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు మొత్తం 14 సంవత్స రాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు.
విభజన తరువాత 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. నవ్యాంధ్రప్రదేశ్‌ను అభివృద్దిపథంలో తీసుకెళ్లడానికి చంద్రబాబు శ్రమించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభ వం ఈ విషయంలో చంద్రబాబుకు తోడ్పడింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక, ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ నగరం పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. అయితే కేవలం రెండేళ్లపాటు మాత్రమే హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు కొనసాగించారు చంద్రబాబు నాయుడు. ఆ తరువాత రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి నంతవరకు ఒక ప్రత్యేకత ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేవారు. ఒక్క 2019 శాసనసభ ఎన్నికలే దీనికి మినహాయింపు. 2019 శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అంతేకాదు మంగళగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి పరాజ యం పాలయ్యారు. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల స్వరూపమే మారింది. తెలుగుదేశం పార్టీ అస్థిత్వమే ప్రమాదంలో పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ అమీతుమీ తేల్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చంద్రబాబు నాయుడు కుటుంబం అంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోంది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయిన తరువాత భువనేశ్వరి తొలిసారిగా ప్రజల్లోకి వచ్చారు.
నారా భువనేశ్వరి కిందటేడాది అక్టోబర్ 25 నుంచి నిజం గెలవాలంటూ… ప్రజల దగ్గరకు వెళ్లారు. చంద్రబాబు స్వంత గ్రామం నారావారిపల్లె నుంచి నిజం గెలవాలి కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు భువనేశ్వరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిర్వహించారు.రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర గుండా యువగళం పాదయాత్ర సాగింది. పాదయాత్ర సందర్భంగా 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు లోకేశ్. వీటితో పాటు మరో ఎనిమిది చోట్ల రచ్చబండ కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహించారు.
చంద్రబాబు నాయుడుకు సంబంధించి మరో విశేషం ఉంది. కొన్ని నెలల కిందట స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్టయ్యారు. దీంతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. ఆ తరువాత బెయిల్‌పై చంద్రబాబు బయటకు వచ్చారు. నలభై ఏళ్లకు పైగా ఉన్న రాజకీయ జీవితంలో అవినీతి ఆరోపణలపై చంద్రబాబు అరెస్టు కావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై సానుభూతి ఉంటుందన్న వార్తలు కొన్ని వర్గాల్లో వినిపిస్తుంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. హైదరాబాద్ నగరంలోనూ ఐటీ ఉద్యోగులు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. రాజకీయ ప్రతీకారంతోనే చంద్రబాబును వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు చేయించారని పనిలోపనిగా నిరాధార ఆరోపణలు కూడా చేశారు. చంద్రబాబు నాయుడుపై సానుభూతి ఉందన్న ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. బాబుపై సానుభూతి అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల సృష్టి మాత్రమేనని పేర్కొంది జగన్ శిబిరం.


