రౌడీస్టార్ విజయ్ దేవరకొండ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఓ సినిమాను రూపొందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రం #VD12 పేరుతో ప్రచారంలో ఉంది. ఈ చిత్రం పూజా కార్యక్రమం జరిగి 8 నెలలైంది. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందంటూ పుకార్లు మొదలయ్యాయి. బడ్జెట్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై విజయ్ దేవరకొండ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటించింది.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో బిజీగా ఉన్నారని.. అది పూర్తయ్యాక ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని వెల్లడించింది. మార్చి మొదటి వారంలో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలిపింది. విజయ్ దేవరకొండ గూఢచారిగా కనిపించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల విభిన్నమైన పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే న్యూయార్క్‌లో ఒక షెడ్యూల్ పూర్తయింది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే విజయ్-శ్రీలీల చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.


