సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్తె , నటి రన్యా రావు బెంగళూరు విమానాశ్రయంలో భద్రత తనిఖీలు క్లియర్ అయ్యాక బయటకు వెళ్లేందుకు ఒక అడుగు దూరంలో ఉన్నప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) బృందం ఆమెను అడ్డుకుని తనిఖీలు చేయగా రూ. 12 కోట్ల విలువైన బంగారు కడ్డీలు దొరికాయి.
2014 కన్నడ చిత్రం మాణిక్యతో తన కెరీర్‌ను ప్రారంభించిన రన్యారావు.. సోమవారం దుబాయ్ నుండి ఎమిరేట్స్ విమానంలో వచ్చింది. ఆమెతో పాటు ఇద్దరు వ్యక్తులు బ్రీఫ్‌కేసుల్లో స్మగ్లింగ్ బంగారాన్ని తీసుకెళ్తున్నారని పక్కాసమాచారం అందింది. కెంపెగౌడ విమానాశ్రయంలో భద్రతను దాదాపుగా క్లియర్ చేసి, బయటకు వెళ్లబోతుండగా, స్మగ్లింగ్ ప్రయత్నం గురించి నిర్దిష్ట సమాచారం తెలిసిన DRI బృందం ఆమెను ఆపి తనిఖీలు చేసింది.
“తనిఖీలు చేయగా, 14.2 కిలోల బరువున్న బంగారు కడ్డీలు ఒక వ్యక్తి చాకచక్యంగా దాచిపెట్టినట్లు తేలింది. 1962 కస్టమ్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం రూ. 12.56 కోట్ల విలువైన ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాం” అని డిఆర్ఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆ తర్వాత అక్కడి నుంచి బెంగళూరులోని లావెల్లె రోడ్‌లోని ఆమె ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. దర్యాప్తు అధికారులకు అక్కడ మరింత బంగారం దొరికింది. “ఈ దాడి తర్వాత, డిఆర్‌ఐ అధికారులు బెంగళూరులోని లావెల్లె రోడ్‌లోని ఆమె నివాస స్థలంలో సోదాలు నిర్వహించారు, అక్కడ ఆమె తన భర్తతో కలిసి నివసిస్తుంది. ఈ సోదాల్లో రూ. 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 2.67 కోట్ల విలువైన భారతీయ కరెన్సీ స్వాధీనం చేసుకున్నాం” అని డిఆర్‌ఐ తెలిపింది.
మహిళా ప్రయాణీకురాలిని కస్టమ్స్ చట్టం, 1962లోని సంబంధిత నిబంధనల కింద అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో మొత్తం రూ. 17.29 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఎయిర్‌పోర్టులో స్వాధీనం చేసుకున్న బంగారంలో ఇదే అతిపెద్దదని అధికారులు వెల్లడించారు.
ఇటీవల రన్యా రావు గల్ఫ్ దేశాలకు తరచుగా వెళ్లి వస్తున్నట్లు నిఘా అధికారులు గుర్తించారు. రన్యా రావు తండ్రి కే రామచంద్రారావు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి. అయితే రన్యకు ఆయన సవతి తండ్రి. ఆ అధికారి మొదటి భార్య చనిపోవడంతో అతను మరో మహిళను వివాహం చేసుకున్నారు, ఆమెకు ఆమె మొదటి వివాహం ద్వారా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో రన్యా ఒకరు.