మానవ అవయవాల అక్రమ రవాణాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా…. కాసులకు కక్కుర్తి పడి మానవత్వాన్ని మరుస్తున్నారు. మానవ అవయవాల కోసం అక్రమ రవాణాలో పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలు ముందు వరుసలో ఉన్నట్లు జాతీయ నేర గణాంకాలు చెబుతున్నాయి. అందులో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సైతం చేరేట్లు ఉంది. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట అవయవాల అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న పేదలే వారి టార్గెట్. ఈ అక్రమ మానవ అవయవాల దందాలో యాజమాన్యాలతో కొందరు డాక్టర్లు కుమ్మక్కు అయి వారి అవయవాలను గుట్టు చప్పుడు కాకుండా కొట్టేస్తున్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున ఓ ఆస్పత్రిలో తాజాగా ఈ రాకెట్ దందా కొనసాగుతోంది. పేరుకే అది ఆస్పత్రి…. లోపల జరిగే దందా అంతా వేరు. చికిత్స కోసం నిరుపేదలు వస్తే వారికి కాసులు కనిపిస్తాయి. ఆ టెస్టు ఈ టెస్టు పేరుతో లక్షల్లో ఫీజులు అవుతాయని భయపెడతారు. లేకుంటే ప్రాణం దక్కదంటారు. అంత డబ్బు పెట్టుకోలేము డాక్టర్ బాబు అనేలా చేస్తారు. ఇక ఆ తర్వాత వారి ప్లాన్ ప్రకారం కిడ్నీ దందా స్టార్ట్ చేస్తారు. ఇదంతా పక్క రాష్ట్రాల్లో జరుగుతోంది. అంతా మాట్లాడుకున్నాక తెలంగాణలోకి ఎంటరై ఇక్కడి నుంచి మిగతా తతంగం అంతా నడుపుతారు.
వీళ్ల కిడ్నీ రాకెట్‌కి మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్‌లోని అలకనంద ఆస్పత్రిని ఎంచుకున్నారు. ఆస్పత్రి యజమానులు, వైద్యులు సైతం కాసులకు కక్కుర్తి పడటంతో ఈ ముఠాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోయింది. కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది ఈ దందా. అక్రమ సంపాదన ఏనాటికైనా బయటపడుతోంది అన్నట్లు… అంతా సాఫీగా సాగుతుండగా… అనుమానం వచ్చి రంగారెడ్డి DMHO వెంకటేశ్వర్లు తనిఖీలు చేపట్టారు. అమాయకుల్ని ఆసరాగా చేసుకొని సరూర్‌నగర్ అలకనంద ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ దందా జరుగుతున్నట్లు గుర్తించారు.
ప్రభుత్వ అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి జరుగుతోందన్న సమాచారంతో ఎల్‌బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా DMHO వెంకటేశ్వర్లు, డిప్యూటీ DMHO గీతా సరూర్ నగర్ పోలీసులతో పాటు సిబ్బంది సంఘటనా హాస్పిటల్‌కు చేరుకుని తనిఖీలు చేపట్టారు. అమాయకుల్ని ఆసరాగా చేసుకొని సరూర్ నగర్‌లోని అలకనంద హాస్పిటల్‌లో కిడ్నీ రాకెట్ దందా కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలకు డబ్బులు ఆశ చూపి మోసం చేస్తున్నారు. పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్లతో కుమ్మక్కై కిడ్నీలను విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు. ఈ విషయం బయటికి వెలుగు చూడడంతో మెడికల్ ఆఫీసర్ హాస్పిటల్ వద్దకు చేరుకుని పోలీసుల సహకారంతో విచారణ చేపట్టారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పేషెంట్లను అంబులెన్స్‌లో నలుగురిని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ట్రీట్‌మెంట్ మధ్యలోనే వదిలిపెట్టారు హాస్పిటల్ వైద్యులు. వీళ్లంతా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా సమాచారం.